అద్వైత దీప్తి
ABN , Publish Date - May 02 , 2025 | 04:18 AM
ధర్మ సంస్థాపనకోసం ప్రతి యుగంలోనూ జన్మిస్తానన్నాడు శ్రీకృష్ణుడు. హిందూ ధర్మం శాఖోపశాఖలుగా చీలిపోయి, ఛాందసత్వం పెరిగిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు... దాన్ని చక్కదిద్ది, సన్మార్గాన్ని చూపించడానికి సాక్షాత్తూ శంకరుడే ఆదిశంకరునిగా...
ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలను ‘త్రిమతాలు’గా వ్యవహరిస్తారు. వాటిని ప్రవచించినవారు శ్రీమధ్వాచార్యులు, శ్రీఆదిశంకరులు, శ్రీమద్రామానుజాచార్యులు. వారిలో ఆదిశంకరులు, రామానుజాచార్యుల మధ్య సుమారు 400 ఏళ్ళ కాల వ్యవధి ఉన్నప్పటికీ... వారిద్దరి జన్మ తిథి వైశాఖ శుద్ధ పంచమి (నేడు) కావడం విశేషం. వారు స్థిరపరచిన సంప్రదాయాలు ఈనాటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ... భక్తి, ఆధ్యాత్మికతలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ధర్మ సంస్థాపనకోసం ప్రతి యుగంలోనూ జన్మిస్తానన్నాడు శ్రీకృష్ణుడు. హిందూ ధర్మం శాఖోపశాఖలుగా చీలిపోయి, ఛాందసత్వం పెరిగిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు... దాన్ని చక్కదిద్ది, సన్మార్గాన్ని చూపించడానికి సాక్షాత్తూ శంకరుడే ఆదిశంకరునిగా అవతరించారంటారు పెద్దలు. జీవుడు, దేవుడు ఒకటేననే అద్వైతాన్ని ప్రబోధించడంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను గ్రంథరూపంలో అందించిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు.
భారతీయ తత్త్వ చింతనపై ఎన్ని తరాలైనా చెరగని ముద్రవేసిన ఆచార్యులలో ప్రథముడు, జగద్గురువు ఆది శంకరులు. బౌద్ధ, జైన మతాలను నాటి పాలకులు అవలంబించి, వాటి వ్యాప్తికి దోహదం చేయడంతో ప్రమాదంలో పడిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆసేతు హిమాచలం పర్యటించారు. వైదిక మతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం దేశం నాలుగు దిక్కుల్లో పీఠాలు స్థాపించారు. వందల ఏళ్ళ తరువాత కూడా ఆ మఠాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి. ఇది శ్రీశంకరుల సంకల్ప శుద్ధికి తార్కాణం.
శ్రీ శంకరులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు ఆర్యాంబ, శివగురు. అయిదేళ్ళ వయసులో... తల్లి అనుమతితో ఆపత్సన్యాసాన్ని స్వీకరించిన శంకరులకు క్రమ సన్యాసాన్ని గోవింద భగవత్పాదులు అనుగ్రహించారు. తదనంతరం వారణాసి నగరంలో వ్యాసుని ఆదేశం మేరకు రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. వ్యాస విరచిత ప్రస్థానత్రయమైన భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. అలాగే, దేవతలను స్తుతిస్తూ ఆయన రచించిన శ్లోకాలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీ శంకరులు పుట్టినప్పుడు ఆయనకు నిర్దేశితమైన ఆయుష్షు ఎనిమిదేళ్ళే. సన్యాసంతో మరో ఎనిమిదేళ్ళు, వ్యాసుడి అనుగ్రహంతో మరో పదహారేళ్ళు... మొత్తం ముప్ఫై రెండేళ్ళపాటు ఆయన ఈ భూమిపై జీవించారు. ఆ కాలంలోనే ఆయన అనన్య సామాన్యమైన అద్భుతాలెన్నో చేశారు. హిందూ ధర్మంలోని వివిధ శాఖలలో ఉన్న ఛాందస భావాలను, మూఢ విశ్వాసాలను శ్రీ శంకరులు తొలగించారు. దైవం అనే గమ్యాన్ని చేరడానికి ప్రయాణించే మార్గాలు వేరైనంత మాత్రాన... తమ మార్గమే గొప్పది అనే పిడివాదం తగదని బోధించారు. షణ్ముఖ స్థాపనాచార్యునిగా వినుతికెక్కారు. ఆ మత మార్గాల్లోని సాత్వికతను వెలికి తీసి, వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తమ దేవతలను ఆరాధించడానికి వీలుగా... పంచాయతన పూజను ఏర్పాటు చేశారు. దేశంలో ఆలయ వ్యవస్థను పటిష్టం చేసి, పూజావిధానాలను నిర్దేశించారు.
ఏం చెప్పారు?
శ్రీ శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. అంటే రెండు కానిది. అంటే ఆత్మ, పరమాత్మ (బ్రహ్మం) వేరు కావు. ఇది అద్వైత సిద్ధాంతానికి పునాది. ‘బ్రహ్మ సత్యం జగన్మిధ్య, జీవో బ్రహ్మైవ న పరః...’ అంటే బ్రహ్మమే సత్యం. మనకు కనిపించే ఈ ప్రపంచం సమస్తం మిధ్య. జీవుడికి, దేవుడికి (బ్రహ్మానికి) భేదం లేదు. ఇదే బ్రహ్మ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందినవారు జీవన్ముక్తులు అవుతారు. శ్రీ ఆదిశంకరుల అద్వైతం భారతీయ తత్త్వ సిద్ధాంతాల్లో అత్యున్నతమైనది అనేది పండితుల అభిప్రాయం. దీన్నే ‘మాయావాదం’ అని కూడా అంటారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..