Suicide After Video: వీడియోకాల్‌లో ప్రియురాలితో వాగ్వాదం... గొంతుకోసుకుని ప్రేమికుడి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:54 AM
ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతుండగా జరిగిన వాగ్వాదం కారణంగా గొంతుకోసుకుని, మిద్దెపై నుంచి దూకి ప్రియుడు...
చెన్నై, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతుండగా జరిగిన వాగ్వాదం కారణంగా గొంతుకోసుకుని, మిద్దెపై నుంచి దూకి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో జరిగిన ఈఘటనలో మృతిచెందిన యువకుడు ఏపీలోని విశాఖ వాసికాగా, ప్రియురాలు హైదరాబాద్ వాసి. విశాఖపట్నానికి చెందిన నవీన్ (20) అక్కడే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, అతడి స్నేహితులు విఘ్నేష్, హరి చెన్నైలో చదువుకుంటూ స్థానిక కోయంబేడులో ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. ఈ నెల 8న తన తల్లి, స్నేహితురాలుతో కలిసి తిరువణ్ణామలై ఆలయ దర్శనం కోసం నవీన్ చెన్నైకు వచ్చి, స్వామి దర్శనం పూర్తి చేసుకుని బుధవారం కోయంబేడులోని స్నేహితుల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాఢు. అక్కడే రాత్రి బస చేశాడు. గురువారం వేకువజామున 3.45 గంటల సమయంలో నవీన్ ఒంటరిగా కూర్చొని ఉండటాన్ని విఘ్నేష్ గమనించి ప్రశ్నించగా ఏమీ లేద ని చెప్పి, కొంత సమయం తర్వాత మిద్దెపైకి వెళ్లాడు. తర్వాత విఘ్నే్‌షకు ఫోన్ చేసి ‘నాకు ఈ ప్రపంచంలో జీవించడానికి ఇష్టంలేదు. నా కుటుంబాన్ని నీవే చూసుకోవాలి’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన విఘ్నేష్ వెంటనే మిద్దెపైకి వెళ్లి చూడగా, కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో....హైదరాబాద్‌కు చెందిన ఒక యువతిని నవీన్ ప్రేమిస్తున్నాడని, వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఏదో విషయమై తీవ్ర స్థాయిలో గొడవపడ్డారని తేలింది. ఆగ్రహించిన నవీన్ విడియోకాల్ మాట్లాడుతూనే గొంతుకోసుకున్నాడని, అనంతరం స్నేహితునికి ఫోన్ చేసి మిద్దెపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది.