Share News

Yasin Malik: పాక్‌లో హఫీజ్‌ సయీద్‌తో చర్చలకు మన్మోహన్‌ సర్కారే నన్ను పంపింది

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:30 AM

జైల్లో ఉన్న జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌.. యాసిన్‌ మాలిక్‌ గత నెల 25న ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పలు సంచలన విషయాలను వెల్లడించారు....

Yasin Malik: పాక్‌లో హఫీజ్‌ సయీద్‌తో చర్చలకు మన్మోహన్‌ సర్కారే నన్ను పంపింది

  • ఢిల్లీ హైకోర్టులో జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌మాలిక్‌ అఫిడవిట్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: జైల్లో ఉన్న జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌.. యాసిన్‌ మాలిక్‌ గత నెల 25న ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ముంబైపై 2006లో జరిగిన (26/11) దాడుల వెనుక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను.. తాను అదే ఏడాది.. అప్పటి ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌ వీకే జోషీ అభ్యర్థన మేరకు పాకిస్థాన్‌లో కలిశానని అందులో పేర్కొన్నారు. పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీకి తిరిగి రాగానే జోషీ తనను ఒక హోటల్‌లో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిసి వివరాలు వెల్లడించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఆయన అభ్యర్థన మేరకు అదే రోజు సాయంత్రం తాను మన్మోహన్‌సింగ్‌ను కలిశానని.. ఆ సమయంలో జాతీయ భద్రత సలహాదారు ఎన్‌కే నారాయణన్‌ కూడా మన్మోహన్‌తో ఉన్నారని పేర్కొన్నారు. సయీద్‌తో భేటీ గురించి వివరాలను తాను వారికి వెల్లడించానని తెలిపారు. అప్పుడు మన్మోహన్‌ తనకు కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు. అప్పట్లో ఢిల్లీలో ఒక బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో.. అలా ఒకవైపు ఉగ్రవాదం కొనసాగుతుంటే మరోవైపు శాంతి చర్చలు సాగవు కాబట్టి ఐబీ అధికారులు తనను సంప్రదించి, సయీద్‌, ఇతర ఉగ్రవాద నేతలతో చర్చలు జరపాల్సిందిగా కోరారని వివరించారు. ఆ భేటీలు జరిగిన 13 ఏళ్ల తర్వాత.. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ నిర్వీర్యానికి ముందు.. తనపై గతంలో పెట్టిన ఉపా కేసులను సమర్థించుకునేందుకు ఆ పాత సమావేశాన్ని వాడుకున్నారని వాపోయారు. తనపై ఉగ్రవాది అనే ముద్ర వేశారని.. ఇది నమ్మకద్రోహం తప్ప మరేమీ కాదని వాపోయారు. కశ్మీరీ రాజకీయ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు, తమ సొంత అజెండాను అమలుచేసేందుకే ఇదంతా చేసినట్టు ఆరోపించారు.

Updated Date - Sep 20 , 2025 | 04:30 AM