Childrens Health: ఆందోళనకరంగా బడిఈడు పిల్లల ఆరోగ్యం
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:50 AM
దేశంలో బడిఈడు పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, చిన్న వయసులోనే విటమిన్ డీ, జింకు లోపాలతో పాటు జీవనశైలి సంబంధిత...
పెరుగుతున్న విటమిన్ డీ, జింక్ లోపాలు,జీవనశైలి సంబంధిత వ్యాధులు
చిల్ట్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో బడిఈడు పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, చిన్న వయసులోనే విటమిన్ డీ, జింకు లోపాలతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్, బీపీ, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తాజాగా విడుదల చేసిన ‘‘చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025’’ నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో విటమిన్ డీ, జింక్ లోపాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. పిల్లల ఎముకల ఆరోగ్యం, శరీర వృద్ధి, రోగనిరోధక శక్తికి కీలకమైన విటమిన్ డీ లోపం చిన్న వయసు నుంచే కనిపిస్తోందని పేర్కొంది. విటమిన్ డీ లోపానికి ప్రధాన కారణాలు సూర్యరశ్మి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, గాఢవర్ణ చర్మం, అధిక కొవ్వు, జన్యుపరమైన మార్పులు వంటి అంశాలేనని నివేదిక స్పష్టం చేసింది. జింక్ లోపం వలన పొట్టితనం (స్టంటింగ్), తరచూ వ్యాధులకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు. జింక్ లోపం వల్ల చిన్నారుల్లో మరణాలు, అనారోగ్యాలు ప్రపంచవ్యాప్తంగా 4 శాతం వరకు నమోదవుతున్నాయని గత అధ్యయనాలు తెలుపుతున్నాయి.
జీవనశైలీ సంబంధిత వ్యాధులు:
విటమిన్ డీ, జింకు లోపాలతో పాటు పిల్లల్లో జీవనశైలి సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025’ నివేదికలో వెల్లడైంది. చిన్న వయసులోనే ట్రైగ్లీజరైడ్లు అధికంగా ఉంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్గిన శిశు మరణాలు:
దేశంలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 2023లో ప్రతి వెయ్యి జననాలకు 25గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 28 ఉండగా, పట్టణాల్లో 18గా నమోదైంది. ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్‌లలో అత్యధికంగా (37), అత్యల్పంగా కేరళలో (5)గా నమోదైంది. అదేవిధంగా దేశంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 29గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 33, పట్టణాల్లో 20గా ఉంది.