Women Reservation: మహిళలకు కోటా రెడీ
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:27 AM
దేశమంతా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తోంది. 2023లోనే చేపట్టిన 128వ రాజ్యాం గ సవరణ ప్రకారం..
2029 ఎన్నికల్లో 33శాతం సీట్లు.. లోక్‌సభ, అసెంబ్లీల్లో అమలుకు కేంద్రం ప్రణాళిక
కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన
ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ, జూన్ 12: దేశమంతా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తోంది. 2023లోనే చేపట్టిన 128వ రాజ్యాం గ సవరణ ప్రకారం.. వనితలకు లోక్‌సభ, అసెంబ్లీల్లో 33శాతం సీట్లను ఖరారు చేయనుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కథనం ప్రచురితమైంది. 2027లో చేపట్టనున్న జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట మహిళలకు 33శాతంకోటా కల్పిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే లోక్‌సభ/అసెంబ్లీ స్థానాల సరిహద్దులను తిరిగి ఖరారుచేయడం.. వాటిలో సీట్ల సంఖ్యను నిర్ణయించడం. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలను కూడా నిర్ధారిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంటు జనగణన చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. జనగణన పూర్తిచేసిన ప్రతిసారీ నియోజకవర్గాలను పునర్విభజించడం తప్పనిసరని రాజ్యాంగంలోని 82వ అధికరణ పేర్కొంటోంది. కాగా.. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ వివాదంగా మారింది. 1971లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉండేది. 2023నాటికి అది 19.7 శాతానికి తగ్గిందని.. దీంతో పార్లమెంటులో తమ సీట్ల సంఖ్య తగ్గుతుందని.. అందుచేత మరో 25ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదంటూ చట్టం చేయాలని తమిళనాడులో పాలకపార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే దక్షిణ రాష్ట్రాలు ఒక్క సీటు కూడా కోల్పోవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు.