Share News

Marriage Scam: పెళ్లే వ్యాపారం

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:00 AM

వివాహ బంధాన్ని వ్యాపారంగా మార్చుకుందో యువతి!. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది.

Marriage Scam: పెళ్లే వ్యాపారం

  • డబ్బు కోసం 11 మందిని పెళ్లాడిన యువతి

  • ‘తాజా వరుడి’ ఆత్మహత్యతో వెలుగులోకి..

చెన్నై, జూలై 15(ఆంధ్రజ్యోతి): వివాహ బంధాన్ని వ్యాపారంగా మార్చుకుందో యువతి!. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి చేసుకుని మోసగించిందన్న మనస్తాపంతో తాజా వరుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ పెళ్లిళ్ల గుట్టు వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులో నామక్కల్‌ జిల్లాకు చెందిన శివషణ్ముగం (37).. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రెండో వివాహం కోసం పెళ్లిళ్ల బ్రోకర్లు తమిళ్‌ సెల్వి (45), కస్తూరి (38), ముత్తులక్ష్మి (45), వేల్‌ మురుగన్‌ (55), నారాయణన్‌ (56)లను సంప్రదించగా, వారంతా కలిసి మదురైకు చెందిన జ్యోతి అలియాస్‌ జ్యోతిలక్ష్మి (23)ని దీప అనే వధువుగా చూపించారు. పెళ్లి కుదిర్చితే రూ.4 లక్షలు కమిషన్‌ ఇచ్చేలా శివషణ్ముగంతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.1.20 లక్షలు పుచ్చుకున్నారు. ఈ నెల 7న ఓ ఆలయంలో వివాహం జరిపించారు. తర్వాత భార్యను తీసుకుని శివషణ్ముగం తన ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దీప నగలు, నగదు, వెండి వస్తువులతో ఉడాయించింది. కంగుతిన్న వరుడు.. దీప, మధ్యవర్తులకు ఫోన్‌ చేయగా, వారి మొబైల్‌ ఫోన్లు స్విచాఫ్‌ చేసిఉన్నాయి. దీంతో మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ.30 వేల నగదు కోసం దీప ఈ పెళ్లికి అంగీకరించినట్టు తేలింది. దీపతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఇదే విధంగా 10 మందిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు విచారణలో దీప వెల్లడించింది.

Updated Date - Jul 16 , 2025 | 06:00 AM