Share News

Dr Shaheen Shahid from Faridabad: ఆ మహిళా డాక్టర్‌.. జైషే ఉగ్రవాద లీడర్‌!

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:20 AM

ఫరీదాబాద్‌ ఉగ్రకుట్రలో అరెస్టయిన మహిళా వైద్యురాలు షహీన్‌ షాహీద్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది....

Dr Shaheen Shahid from Faridabad: ఆ మహిళా డాక్టర్‌.. జైషే ఉగ్రవాద లీడర్‌!

  • అల్‌ ఫలాహ్‌ ప్రైవేటు యూనివర్సిటీ

  • రెసిడెంట్‌ వైద్యురాలు షహీన్‌ వెనుక కీలక కోణం

  • భారత్‌లో జైషే మహమ్మద్‌మహిళా విభాగం బాధ్యతలు ఆమెవే..

  • ఆయుధాలు దాచేందుకు ఆమె కారునే వినియోగించిన ఉగ్రవాది ముజమ్మిల్‌

న్యూఢిల్లీ, నవంబరు 11: ఫరీదాబాద్‌ ఉగ్రకుట్రలో అరెస్టయిన మహిళా వైద్యురాలు షహీన్‌ షాహీద్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది. జైషే మహమ్మద్‌ మహిళా విభాగం జమాతుల్‌ మొమినాత్‌ భారత విభాగానికి షహీన్‌ నేతృత్వం వహిస్తున్నట్టు వెల్లడైంది. ఆమెను అరెస్టు చేసిన అనంతరం అధికారులు చేపట్టిన దర్యాప్తులో కీలక అంశాలు బయటపడినట్టు తెలిసింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్‌ ప్రధాన కార్యాలయాన్ని భారత వాయుసేన ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో కాందహార్‌ విమానం హైజాక్‌ సూత్రధారి యూసుఫ్‌ అజార్‌ సహా జైషే మహమ్మద్‌ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలోనే యూసుఫ్‌ అజార్‌ భార్య, జైషే వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌ సోదరి అయిన సాదియా అజార్‌ నేతృత్వంలో ‘జమాతుల్‌ మొమినాత్‌’ పేరిట మహిళా విభాగాన్ని జైషే మహమ్మద్‌ ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాని భారత విభాగం బాధ్యతలను వైద్యురాలు షహీన్‌కు అప్పగించినట్టు తెలిసింది.

ప్రైవేటు యూనివర్సిటీలో వైద్యురాలిగా..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన షహీన్‌ హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్‌ ఫలాహ్‌ ప్రైవేటు యూనివర్సిటీలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ముజమ్మిల్‌ కూడా వైద్యుడిగా పనిచేస్తున్నారు. శ్రీనగర్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పోస్టర్లు వెలిసిన కేసులో ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే షహీన్‌కు ఉగ్రవాద లింకులు ఉన్నాయని, ఆయుధాలను దాచిపెట్టేందుకు ఆమె కారును వినియోగిస్తున్నారని గుర్తించారు. షహీన్‌ను అరెస్టు చేసి, ఆమె మారుతి స్విఫ్ట్‌ కారులో ఒక ఆసాల్ట్‌ రైఫిల్‌, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా షహీన్‌కు ‘జమాతుల్‌ మొమినాత్‌’ భారత విభాగంలో షహీన్‌ కీలకంగా పనిచేస్తున్నారని, మహిళల రిక్రూట్‌మెంట్‌ చేపట్టారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా బాగా చదువుకున్న, వివిధ వృత్తుల్లో ఉన్నవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేల్చారు. కాగా, షహీన్‌ ప్రవర్తన చిత్రంగా ఉండేదని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడది కాదని ఆమె పనిచేస్తున్న అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. ‘‘షహీన్‌ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేది. ఒక్కసారి చెప్పాపెట్టకుండానే వెళ్లిపోయేది. చాలా మంది కాలేజీకి వచ్చి ఆమెను కలుస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఆమె చిత్రంగా ప్రవర్తించేది. దీనిపై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి’’ అని వెల్లడించారు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

Updated Date - Nov 12 , 2025 | 02:20 AM