Share News

GST Benefits: లబ్ధి వినియోగదారుడికి అందేనా

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:33 AM

ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సిమెంట్‌ బస్తా ధర రూ.250 ఉండగా 28 శాతం జీఎస్టీ కలుపుకొని రూ.320కు లభిస్తుంది..

GST Benefits: లబ్ధి వినియోగదారుడికి అందేనా

  • పాత, కొత్త సరుకులంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు

  • సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే

  • విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు: జీఎస్టీ కమిషనర్‌

  • వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సిమెంట్‌ బస్తా ధర రూ.250 ఉండగా 28 శాతం జీఎస్టీ కలుపుకొని రూ.320కు లభిస్తుంది. సిమెంట్‌పై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో సెప్టెంబరు 22న ఆ బస్తా రూ.295కే లభ్యం కావాలి. కానీ ఆ ధరకు అమ్ముతారా? దుకాణదారులు జీఎస్టీ మార్పులను కచ్చితంగా అమలు చేస్తారా? లేదా కంపెనీ ధర పెంచిందని, పాత సరుకని ఏదో ఓ కారణం చెప్పి మాయ చేస్తారా?.. ఒక్క సిమెంట్‌ విషయంలోనే కాదు జీఎస్టీ తగ్గిన అన్ని ఉత్పత్తుల విషయంలో సామాన్య ప్రజలకు ప్రస్తుతం ఈ సందేహాలు ఉన్నాయి. ఉత్పత్తి సంస్థలు జీఎస్టీ తగ్గింపు ఫలాలను కొనుగోలుదారులకు అందిస్తాయా? అనే చర్చ జరుగుతోంది. అయితే, జీఎస్టీ నిబంధనల ప్రకారం ఈనెల 22వ తేదీ తర్వాత వస్తువులను తగ్గిన పన్నుల ప్రకారమే విక్రయించాలని జీఎస్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, జీఎస్టీ తగ్గింపు అమలు అనేది వినియోగదారులకు వస్తువులను విక్రయించే సంస్థల నైతికతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. లాభాలే ధ్యేయంగా పనిచేసే సంస్థలు కొనుగోలుదారులకు ఫలాలు అందించవని, తాము కోల్పోయే ఇన్‌ఫుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను ఏదో విధంగా ఆర్జించేందుకు ఎత్తుగడలు వేస్తాయని అంటున్నారు. వ్యాపారులు ఎవరైనా తగ్గించిన పన్ను ప్రకారం అమ్మకాలు చేయకపోతే కొనుగోలుదారులు నేషనల్‌ యాంటీ ప్రాఫెటిరింగ్‌ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని జీఎస్టీ అధికారులు వెల్లడించారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన కొత్తల్లోనే ఈ అథారిటీని అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం ఉందని, ఈ విధానాన్ని దేశమంతా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.


ప్రజలకు ప్రయోజనాలు అందాల్సిందే

తగ్గిన పన్నుల మేర ఆ లాభాలను కొనుగోలుదారులకు అందించాల్సిందే. సామాన్య ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్‌పేస్టు, బ్రష్‌, పౌడర్‌, సైకిళ్లు, వ్యవసాయ పరికరాలు, ఔషధాలను 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రజారోగ్యం దృష్ట్యా కొన్ని రకాల ఔషధాలకు, ఆరోగ్య బీమా పాలసీలకు జీఎస్టీ లేకుండా చేశారు. ఈ ప్రయోజనాలు వినియోగదారులకు అందాలంటే ఉత్పత్తి సంస్థలు, విక్రయదారులు సహకరించాలి. జీఎస్టీ ప్రయోజనాలు అందించని విక్రయదారులపై ప్రజలు ఫిర్యాదులు చెయ్యాలి.

- జీఎస్టీ కమిషనర్‌, అప్పీల్స్‌, హైదరాబాద్‌

Updated Date - Sep 05 , 2025 | 04:33 AM