Supreme Court: బాణసంచాపై నిషేధంఢిల్లీకే పరిమితం ఎందుకు?
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:44 AM
బాణసంచా నిషేధం ఒక్క ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం చేయడం ఎందుకని, దానిపై జాతీయ విధానం రూపొందించవచ్చు కదా అని సుప్రీంకోర్టు కేంద్ర...
జాతీయ విధానం ఉండాలి కదా?
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: బాణసంచా నిషేధం ఒక్క ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం చేయడం ఎందుకని, దానిపై జాతీయ విధానం రూపొందించవచ్చు కదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్వచ్ఛమైన గాలి కేవలం రాజధానిలోని ఉన్నత వర్గాల వారికే పరిమితం కాకూడదని, దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే విధంగా విధానాన్ని రూపొందించడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ తాను గత శీతాకాలంలో అమృత్‌సర్‌లో ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ కన్నా అధికంగా కాలుష్యం ఉండడాన్ని గమనించానని, అక్కడ మాత్రం బాణసంచాపై నిషేధం లేదని అన్నారు. ‘‘ఒక వేళ బాణసంచాను నిషేధిస్తే దానిని దేశమంతటా నిషేధించాలి’’ అని చెప్పారు. దీనిపై కోర్టు సహాయకురాలిగా వ్యవహరిస్తున్న అపరాజిత సింగ్ స్పందిస్తూ కాలుష్యం ఒక్క ఉన్నత వర్గాల సమస్య అని భావించడం సరికాదని చెప్పారు. ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయినా ఢిల్లీలో కాలుష్యం పెరిగినప్పుడు ఉన్నతవర్గాల వారు వేరేచోటికి వెళ్లి ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటున్నారని అన్నారు.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సమాధానం ఇస్తూ ‘గ్రీన్ క్రాకర్స్’ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే విషయమై జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఈ సమస్యపై వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ నుంచి సవివరమైన నివేదిక తెప్పించాలని ధర్మాసనం ఆమెకు సూచించింది. బాణసంచా తయారీదార్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి రసాయన మిశ్రమాలను ఉపయోగించాలో ‘నీరి’ సూచిస్తే దానిని తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. మరో సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ మాట్లాడుతూ బాణసంచా తయారీపై ఆంక్షలు విధించడంతో పాటు 2028 వరకు మంజూరు చేసిన లైసెన్సులను కూడా అధికార్లు రద్దు చేస్తున్నారని చెప్పారు. బాణసంచా వ్యాపారుల లైసెన్సుల రద్దుపై యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణను 22కు వాయిదా వేసింది.
సుప్రీం ఆవరణలో ఫొటోలపై నిషేధం
సుప్రీంకోర్టు ప్రధాన ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని ‘హై సెక్యూరిటీ జోన్’గా పరిగణించిన సుప్రీంకోర్టు.. అక్కడి లాన్‌లోకి కెమేరాలు, ట్రైపాడ్‌లు, సెల్ఫీ స్టిక్ వంటి పరికరాలను తీసుకెళ్లకూడదంటూ బుధవారం సర్క్యులర్ జారీ చేసింది.
బెయిల్ పిటిషన్లపై 2 నెలల్లోనే నిర్ణయం
బెయిల్ పిటిషన్లపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం అన్ని హైకోర్టులకు సూచించింది. బెయిల్ పిటిషన్లను దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం న్యాయాన్ని నిరాకరించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. దీనిపై అన్ని జిల్లా కోర్టులకు సూచనలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది. కేసులోని మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
దివ్యాంగులకు జనరల్ కోటా వర్తింపును పరిశీలించండి
ప్రతిభ చూపిన దివ్యాంగులకు జనరల్ కోటా వర్తింపుచేయడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మార్కులు సంపాదిస్తే వారికి జనరల్ కోటాలో సీట్లు ఇస్తున్నారని, అదే విధానాన్ని దివ్యాంగులకు కూడా అమలు చేయాలని అభిప్రాయపడింది. వారికి కేవలం దివ్యాంగుల కోటాలోనే సీట్లు ఇస్తామనడం వివక్ష కిందకే వస్తుందని తెలిపింది. దీనిపై అక్టోబరు 14లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పదోన్నతుల్లోనూ ఈ విధానాన్ని అవలంబించాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 13కు వాయిదా వేసింది.