Life Expectancy: ఆయుర్దాయంలో మనం వెనుకే!
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:42 AM
ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుష్షుతో జీవించే ప్రజలు ఎవరంటే.. జపనీయులే అని చెబుతాం..? జపాన్‌లో మనిషి సగటు ఆయుర్దాయం 85 ఏళ్లు. అయితే వారితో పోలిస్తే....
జపనీయులు 85 ఏళ్లు.. భారతీయులు 72 ఏళ్లే..
రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో తేడానే కారణం
న్యూఢిల్లీ, అక్టోబరు 5: ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుష్షుతో జీవించే ప్రజలు ఎవరంటే.. జపనీయులే అని చెబుతాం..? జపాన్‌లో మనిషి సగటు ఆయుర్దాయం 85 ఏళ్లు. అయితే వారితో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం 13 ఏళ్లు తక్కువగా ఉందని తాజా డేటాలో వెల్లడైంది. జపనీయులు అంత ఎక్కువకాలం జీవించడానికి, భారతీయుల జీవితకాలం 75 ఏళ్లకు తగ్గిపోవడానికి రోజువారీ అలవాట్లు, తినే ఆహారమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం, పని, నిద్ర వంటి వాటిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే ఎవరైనా మరింత ఎక్కువ కాలం హాయిగా జీవించొచ్చంటున్నారు.
నిశ్చల జీవితం..!
జపాన్‌లో ఒకచోటు నుంచి మరొక చోటుకి వెళ్లాలంటే ఎక్కువగా నడిచే వెళ్తారు. సైకిల్ తొక్కడం వారి దినచర్యలో భాగం. వాళ్లు రోజూ 7వేల నుంచి 10 వేల అడుగుల దూరం నడుస్తారు. కానీ.. భారత్‌లో ఎక్కడికైనా వెళ్లాలంటే.. కారు, క్యాబ్, లేదంటే బైక్ వినియోగిస్తారు. పట్టణాల్లో ఉండే వాళ్లయితే రోజుకు కనీసం 3వేల అడుగులు కూడా వేయడం లేదు. జపాన్ వాళ్లు బ్రేక్‌ఫా్‌స్టలో మిసో సూప్, రైస్, గ్రిల్డ్ ఫిష్‌తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకుంటారు. భారత్‌లో అల్పాహారం అంటే.. నెయ్యి, వెన్నతో కూడి పరోటాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలు ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువవుతాయి.
పని ఒత్తిడి..
జపాన్‌లో పనికి అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కడ రోజూ సగటున 8.5 గంటలు పనిచేస్తారు. భారత్‌లో రోజూ 10 నుంచి 12 గంటలు కష్టపడతారు. దీనికి ప్రయాణ సమయాన్ని కూడా జోడిస్తే భారతీయులు రోజులో ఎక్కువ సమయం కూర్చుని పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
నిద్రలేమి
జపానీయులు సగటున 6 నుంచి 7 గంటలు నిద్రపోతారు. భారతీయుల సగటు నిద్ర 5-6 గంటలే. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు, అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. జపనీయులు నడక, సైక్లింగ్ వంటి దినచర్యతో ఫిట్‌నె్‌సను వారి జీవితంలో భాగం చేసుకుంటారు. భారత్‌లో చాలా కొద్దిమంది మాత్రమే ఫిట్‌నె్‌సపై దృష్టి పెడతారు.