Share News

NIA Investigation: భూత వైద్యులు

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:04 AM

ఢిల్లీ పేలుళ్లు కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్‌ కాలర్‌ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

NIA Investigation: భూత వైద్యులు

  • ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్‌కాలర్‌ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి

  • ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు

  • మరో 200 మందిపైనా దర్యాప్తు సంస్థల నిఘా

  • ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు, విడుదల

  • ఆమె సెల్‌ఫోను, ఓ సిమ్‌ కార్డు సీజ్‌

  • ఉమర్‌ నబీ సహచరుడు రషీద్‌ అలీ అరెస్టు

  • పేలిన ఐ20 కారు రిజిస్ట్రేషన్‌ రషీద్‌ పేరిటే

శ్రీనగర్‌, నవంబరు 16: ఢిల్లీ పేలుళ్లు కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్‌ కాలర్‌ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అయితే, ఢిల్లీ పేలుడుతోపాటు వైట్‌కాలర్‌ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మందికి పైగా డాక్టర్లు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పో యారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, కశ్మీరుల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో 200 మంది వైద్యుల కదలికలపైనా నిఘా ఉంచినట్టు వెల్లడించాయి. మరోవైపు, ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారిన అల్‌ఫలా యూనివర్సి టీ ల్యాబ్‌లోనే అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు పదార్థం తయారైందని, పాక్‌ ఉగ్రవాద నేత మసూద్‌ అజర్‌ సోదరి మార్గదర్శకత్వంలో లఖ్‌నవూ డాక్టర్‌ షాహిన్‌ సయీద్‌ ఈ కార్యక్రమాలకు సారథ్యం వహించిందని తెలుస్తోంది. కాగా, ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకి కారణమైన ఐ20 కారును నడిపిన వ్యక్తిని డాక్టర్‌ ఉమర్‌ నబీగా గుర్తించిన పోలీసులు అతడితో సంబంధము న్న ఐదుగురు వైద్యులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ వైద్యుల కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో ఆయా వైద్యులతో కలిసి చదువుకున్న, పని చేసిన వైద్యులపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రియాంక శర్మ అనే వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన డాక్టర్‌ అదీల్‌కు ప్రియాంక శర్మ తో పరిచయం ఉంది. అనంత్‌నాగ్‌ ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ ఉద్యోగైన అదీల్‌.. కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు ప్రియాంక శర్మను గుర్తించారు. హరియాణాలోని రోహ్‌టక్‌కు చెందిన ప్రియాంక శర్మను అనంత్‌నాగ్‌లో ఆమె నివాసముంటున్న ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు.


నబీ సహచరుడి అరెస్టు

ఎర్రకోట వద్ద పేలుడుకు గురైన ఐ20 కారును నడిపిన డాక్టర్‌ ఉమర్‌ నబీ సహచరుడు అమీర్‌ రషీద్‌ అలీ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ ఆదివారం అరెస్టు చేసింది. పేలుడుకు గురైన ఐ20 కారు రషీద్‌ అలీ పేరు మీదే రిజిస్ట్రేషన్‌ జరిగిందని అధికారుల తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని పంపోరేకు చెందిన రషీద్‌... కారు కొనుగోలు విషయంలో నబీకి సహకరించేందుకు ఢిల్లీకి వచ్చాడని, ఎర్రకోట సమీపంలో అదే కారు పేలిందని అధికారులు పేర్కొన్నారు. ఇక, డాక్టర్‌ ఉమర్‌ నబీ అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షల నగదు అందుకున్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి పలువురు హవాలా డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. నబీ నగదు రూపంలో చెల్లింపులు చేసి హరియాణాలోని నుహ్‌లో పెద్ద ఎత్తున ఎరువులు కొనుగోలు చేసినట్టు గుర్తించామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.


కొడుకు, సోదరుడి అరెస్టులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వైట్‌ కాలర్‌ ఉగ్రవాదం ఆరోపణలపై పోలీసులు తన కుమారుడు, సోదరుడిని అరెస్టు చేయడంతో మనస్తాపం చెంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ వ్యాపారి ఆదివారం ఆత్మహత్యకు యత్నించాడు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన బిలాల్‌ అహ్మద్‌ వానీ(50) అనే వ్యాపారి శరీరంపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిపాలైన బిలాల్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

Updated Date - Nov 17 , 2025 | 04:06 AM