CM Mamata Banerjee: బాధితురాలు కాలేజీ బయటకు.. అర్ధరాత్రి ఎలా వెళ్లింది
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:29 AM
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ ప్రాంతంలో వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే బాధితురాలు అర్ధరాత్రి 12.30 గంటలకు కాలేజీ బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు.
వైద్యవిద్యార్థిని గ్యాంగ్‌రేప్ కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమత
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
కోల్‌కతా, అక్టోబరు 12 : పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ ప్రాంతంలో వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే బాధితురాలు అర్ధరాత్రి 12.30 గంటలకు కాలేజీ బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఆమె అర్ధరాత్రి బయటకు ఎలా వెళ్లిందో మెడికల్ కాలేజీ నిర్వాహకులు సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు తమ విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు బయటకు అనుమతించకూడదన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హాస్టల్ నిబంధనలు పాటించాలని, రాత్రిళ్లు బయటకు వెళ్లకూడదని సూచించారు. గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష తప్పదన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయని అవి కూడా ఖండించదగినవని చెప్పుకొచ్చారు. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు ఎన్నో అని.. అలాగే ఒడిశాలోనూ మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని ఆరోపించారు. అక్కడి ప్రభుత్వాలు వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే, అనంతరం తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. ‘‘మీరో ప్రశ్న వేస్తారు.. దానికి నేను సమాధానం ఇస్తాను.. మీరు దాన్ని వక్రీకరిస్తారు.. ఇలాంటి రాజకీయాలు చేయవద్దు..’’ అని మీడియాను ఉద్దేశించి అన్నారు. కాగా వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు షేక్ రియాజుద్దీన్, మరొకరు షేక్ ఫిర్దౌస్‌గా గుర్తించారు. కాగా ఒడిశా సీఎం మాఝి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మమతను కోరారు.