Supreme Court: 16న వక్ఫ్ పిటిషన్లపై సుప్రీం విచారణ
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:41 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టం-2025పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈనెల 16న విచారించనున్నది. అలాగే, మతమార్పిడి చట్టాలపై కూడా సుప్రీం విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టం-2025ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈనెల 16న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమలును నిలుపుదల (స్టే) చేయాలంటూ పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిని వెంటనే విచారణకు స్వీకరించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ ప్రకారమే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటుచేశారు. ఈ బెంచ్‌లో జస్టిస్ సంజ య్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ సభ్యులుగా ఉన్నారు. కాగా వక్ఫ్ సవరణ చట్టానికి అనుకూలంగా హిందూసేన అధ్యక్షుడు పిటిషన్ దాఖలుచేశారు. నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదననూ ఆలకించాలంటూ కేంద్రప్రభుత్వం తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలుచేసింది. మరోవైపు, నూతన వక్ఫ్ చట్టంపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్త ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రధానంగా ముస్లింలను కలిసి తాజా చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.
మతమార్పిడి చట్టాలపై 16న సుప్రీంలో విచారణ
మతమార్పిడి సమస్యపై దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బలవంతపు మతమార్పిడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని పిటిషన్లు, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ కల్పించాలని కోరుతూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. భయపెట్టడం, ఆర్థికంగా ప్రలోభపెట్టడం వంటి మోసపూరిత చర్యల ద్వారా జరిగే మతమార్పిడిలను అరికట్టాలని పిటిషనర్లు కోరారు.