VVPAT Slips Found: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:21 AM
బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది..
సమస్తీపుర్, నవంబరు 8: బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం.. ఓ సహాయ రిటర్నింగ్ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ కళాశాల సమీపంలో లభించిన ఈ స్లిప్పులు మాక్‌పోల్‌కు సంబంధించినవని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. వాస్తవ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన స్లిప్పులు సురక్షితంగా ఉన్నాయని, ఈ ఘటన వల్ల ఎన్నికల పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లలేదని ఆయన తేల్చి చెప్పారు. రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈవీఎమ్‌లు, వీవీప్యాట్‌ల పనితీరురును పరీక్షించడానికి, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ పూర్తయ్యాక, వీవీప్యాట్ స్లిప్పులను ప్రత్యేక కవర్లో సీలు చేసి సురక్షితంగా దాచాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను సంబంధిత అధికారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.