Bihar Election Analysis: సర్ మార్చిన తలరాత
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:40 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అంచనాలకు మించి 202 సీట్లు సాధించింది. మహాగఠ్‌బంధన్ కూటమి దారుణంగా చతికిలపడింది.
174 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కంటే గెలిచిన అభ్యర్థుల మెజారిటీ తక్కువే!
91 సీట్లలో ఓడిన సిట్టింగులు.. అందులో 75 మంది మహాగఠ్‌బంధన్ అభ్యర్థులే..
‘సర్’పై విశ్లేషణతో ‘ది క్వింట్’ కథనం
న్యూఢిల్లీ, నవంబరు 15: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అంచనాలకు మించి 202 సీట్లు సాధించింది. మహాగఠ్‌బంధన్ కూటమి దారుణంగా చతికిలపడింది. ఇటీవల బిహార్‌లో చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)’ కూడా ఈ ఫలితాలకు కారణమని విశ్లేషిస్తూ ’ది క్వింట్’ కథనం ప్రచురించింది. ‘సర్’తో చాలా వరకు ఎన్డీయేకే ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. ఈ కథనం మేరకు.. 174 నియోజకవర్గాల్లో ‘సర్’తో తొలగించిన ఓట్ల కంటే అభ్యర్థులకు తక్కువ మెజారిటీ వచ్చింది. ఇందులోని 91 స్థానాల్లో సిట్టింగ్‌లు ఓటమి పాలయ్యారు. వీటిలో గతంలో మహాగఠ్‌బంధన్ గెలుచుకున్నవి 75కాగా, ఎన్డీయే గెలుచుకున్నవి 14 మాత్రమే. ఇతర చిన్న పార్టీలు గెలిచినవి 2 స్థానాలు. అదే ఈసారి మహాగఠ్‌బంధన్‌కు 15 మాత్రమే వస్తే, ఎన్డీయే 75 సీట్లు గెలుచుకుంది. ఇతరులకు ఒక్కసీటే దక్కింది. అంటే ‘సర్’తో ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో చాలా వరకు ఎన్డీయేనే చేజిక్కించుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు బిహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌కు ఓట్ల శాతం పెద్దగా ఏమీ తగ్గలేదని ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఎన్డీయే కూటమికి 41.4 శాతం, మహాగఠ్‌బంధన్‌కు 38.8 శాతం, ఇతరులకు 19.8శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఎన్డీయే కూటమికి 46.9 శాతం (5.5శాతం ఎక్కువ), మహాగఠ్‌బంధన్‌కు 37.9 శాతం (0.9శాతం తక్కువ), జనసురాజ్ పార్టీకి 3.3శాతం (కొత్తగా ఏర్పాటైనది), ఇతరులకు 12.0శాతం ఓట్లు (7.9శాతం తక్కువ) ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహాగఠ్‌బంధన్‌కు తగ్గిన ఓట్లు ఒకశాతం లోపే. గతంలో చిన్న పార్టీలకు పోలైన ఓట్లు ఎన్డీయేకు పడ్డాయి. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో బిహార్‌లో నకిలీ, తప్పుడు ఓట్లు తొలగించడం వల్లే ఎన్డీయే ఘన విజయం సాధించిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఆర్జేడీ, కాంగ్రెస్ ఆ తప్పుడు ఓట్లతోనే విజయం సాధిస్తూ వచ్చాయని ఆరోపించారు. అందుకే ‘సర్’ ప్రక్రియను కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, ఇతర ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రజాసేవలో గెలుపోటములు తప్పవు: ఆర్జేడీ పట్నా, నవంబరు 15: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆర్జేడీ శనివారం తొలిసారిగా స్పందించింది. ఓటమికి నిరాశ చెందడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఎక్స్‌లో హిందీ భాషలో పోస్టు పెట్టింది. ‘‘ప్రజాసేవ విరామంలేని ప్రక్రియ, ముగింపులేని ప్రయాణం. ఎగుడుదిగుడులు తప్పవు. ఓడినప్పుడు నిరాశ చెందడం, గెలిచినప్పుడు గర్వపడడం ఉండదు. రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ. వారి గొంతును వినిపిస్తునే ఉంటుంది’’ అని పేర్కొంది. ఎస్‌ఐఆర్ పూర్తైన తర్వాత కూడా 3 లక్షల మంది ఓటర్లను చేర్చాం అందుకే బిహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్ల నుంచి 7.45 కోట్లకు పెరిగింది: ఈసీ న్యూఢిల్లీ, నవంబరు 15: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్) ముగిసి, తుది జాబితాను ప్రకటించిన తర్వాత.. మళ్లీ 3లక్షల మంది ఓటర్లను అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాల్లో చేర్చామని ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హులైన ఓటర్లను నామినేషన్ల గడువు ముగిసే తేదీకి 10రోజుల ముందు వరకు ఓటరు జాబితాలో చేర్చవచ్చని తెలిపారు. ‘‘బిహార్‌లో ఎస్‌ఐఆర్ పూర్తై తుది జాబితా ప్రకటించినప్పుడు 7.42కోట్ల మంది ఉన్న ఓటర్లు.. పోలింగ్ ముగిసే సమయానికి 7.45కోట్లకు ఎలా పెరిగారు’’ అంటూ కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఈసీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. బిహార్‌లో సెప్టెంబరు 30న ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. దీని ప్రకారం బిహార్‌లో 7.42కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, రెండు దశల పోలింగ్ పూర్తైన తర్వాత చేసిన ప్రకటనలో మొత్తం ఓటర్ల సంఖ్యను ఈసీ 7.45కోట్లుగా ప్రకటించింది. బిహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొదటి దశ పోలింగ్‌కు నామినేషన్ల తుది గడువు అక్టోబరు 17, రెండో దశ తుది గడువు అక్టోబరు 20. అంటే.. తుది ఓటరు జాబితా ప్రకటించిన 10 రోజుల్లోనే ఎన్నికల సంఘం మళ్లీ 3లక్షల మంది ఓటర్లను చేర్చిందన్న మాట.