Share News

Volcano Eruption in Ethiopia: ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం..భారత్‌ నుంచి విమానాలు రద్దు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:31 AM

ఆఫ్రికా ఖండం ఈశాన్య ప్రాంతంలోని ఇథియోపియాలో సుమారు 12 వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న హేలి గుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది....

Volcano Eruption in Ethiopia: ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం..భారత్‌ నుంచి విమానాలు రద్దు

  • సుమారు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద

  • అరేబియా మీదుగా భారత్‌ వైపు బూడిద మేఘాలు

  • జాగ్రత్తగా ఉండాలని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన డీజీసీఏ

న్యూఢిల్లీ/శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆఫ్రికా ఖండం ఈశాన్య ప్రాంతంలోని ఇథియోపియాలో సుమారు 12 వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న హేలి గుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దానికి ముందు ఆ ప్రాంతంలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అగ్ని పర్వత విస్ఫోటంతో వాతావరణంలో 15 కిలోమీటర్ల ఎత్తులోకి పెద్ద ఎత్తున బూడిద, దట్టమైన పొగలను ఎగజిమ్మింది. దట్టమైన బూడిద మేఘాలు యెమెన్‌, ఒమన్‌, అరేబియా సముద్రం, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌వైపు కదులుతున్నాయి. సోమవారం రాత్రి భారత్‌లోకి ప్రవేశించాయి. బూడిద మేఘాలు, పొగ కమ్ముకోవడంతో.. భారత్‌ నుంచి గల్ఫ్‌, యూరప్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఈ బూడిద, ధూళి మేఘాలు చైనా వరకు విస్తరించవచ్చని అంతర్జాతీయ వాతావరణ విభాగాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో బూడిద మేఘాలు కమ్ముకున్న ప్రాంతాల నుంచి ప్రయాణించవద్దంటూ విమానయాన సంస్థలకు డీజీసీఏ అత్యవసర సూచనలు జారీ చేసింది.

వరుసగా విమానాల రద్దు, దారి మళ్లింపు..

బూడిద మేఘాలు, దట్టమైన పొగ కారణంగా పలు విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆకాశ ఎయిర్‌, ఇండిగో, కేఎల్‌ఎం తదితర సంస్థలు ప్రకటించాయి. సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఖతార్‌లోని దోహా వెళ్లాల్సిన 6ఈ 1315 ఇండిగో విమానం రద్దయింది. 158 ప్రయాణికులు, సిబ్బంది విమానంలోకి ఎక్కి, అంతా సిద్ధమయ్యాక దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, అందరినీ కిందకు దింపారు. ఇక దోహా నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 6ఈ 1316 విమాన సర్వీసును కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కేరళలోని కన్నూర్‌ నుంచి అబుధాబికి బయలుదేరిన 6ఈ 1433 ఇండిగో విమానాన్ని మధ్యలోనే అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమ, మంగళవారాల్లో జెడ్డా, కువైట్‌, అబుధాబి వెళ్లే, తిరిగొచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్టు ఆకాశ ఎయిర్‌ ప్రకటించింది.

Updated Date - Nov 25 , 2025 | 06:46 AM