Share News

Swiggy Instamart: ఒక్కరి స్విగ్గీ ఇన్‌స్టా బిల్‌ 3.6 లక్షలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:18 AM

ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి.. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్‌ పెట్టేద్దాం. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వెంటనే కావాలి యాప్‌లో బుక్‌ చేసేద్దాం.. ఇలా విజయవాడ వాసులు స్పీడ్‌ డెలివరీ యాప్‌లను తెగవాడేస్తున్నారు....

Swiggy Instamart: ఒక్కరి స్విగ్గీ ఇన్‌స్టా బిల్‌ 3.6 లక్షలు

  • ‘స్పీడ్‌’ షాపింగ్‌లో బెజవాడ దూకుడు

  • మహానగరాలకు దీటుగా పెరిగిన ఆర్డర్లు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి.. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్‌ పెట్టేద్దాం. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వెంటనే కావాలి యాప్‌లో బుక్‌ చేసేద్దాం.. ఇలా విజయవాడ వాసులు స్పీడ్‌ డెలివరీ యాప్‌లను తెగవాడేస్తున్నారు. స్పీడ్‌ కొనుగోళ్లలో మెట్రో మహానగరాలనే తలదన్నేలా ఆర్డర్లు పెట్టేస్తున్నారు. బెజవాడియన్ల కొనుగోళ్ల జోరు చూసి ఇన్‌స్టామార్టే ఆశ్చర్యపోతోంది. ఈ టూటైర్‌ నగరాన్ని షాపింగ్‌లో దేశంలోనే శక్తిమంతమైన నగరాల సరసన చేర్చింది. దే శంలో అత్యంత ప్రజాదరణ ఉన్న స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్‌ ‘క్విక్‌ ఈ కామర్స్‌’ వార్షిక గణాంకాలను విడుదల చేసింది. ఇన్‌స్టామార్ట్‌ వార్షిక వినియోగ ట్రెండ్స్‌ నివేదిక మేరకు స్పీడ్‌ డెలివరీ కొనుగోళ్లలో విజయవాడ దూసుకుపోతోంది. ఆ జోరుతో దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకొని షాపింగ్‌ సిటీగా పేరు తెచ్చుకుంది. విజయవాడ ప్రజల్లో వస్తున్న ఆర్థిక మార్పులకు, జీవనశైలికి ఈ కొనుగోళ్లు అద్దం పడుతున్నాయని ఆ నివేదిక వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో విజయవాడ నగరం అసాధారణ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది.

పెరుగుదల మామాలుగా లేదు

విజయవాడ వాసులు ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కిరాణా సరుకులే కాకుండా కిరాణాయేతర సరుకులు కూడా భారీగా ఆర్డర్లు ఇచ్చారు. బ్యాగులు, వాలెట్లు, ఉపకరణాల ఆర్డర్లు కిందటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 538 శాతం పెరిగాయి. క్రీడలు, ఫిట్‌నెస్‌ ఉపకరణాలకు సంబంధించి కూడా 495 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాదిలో ఫిట్‌నెస్‌ ఆరోగ్య జీవనం కోసం ఇచ్చే ఆర్డర్లు 83 శాతం పెరిగాయి. ఫ్యాషన్‌ దుస్తుల కొనుగోళ్లు కూడా భారీ సంఖ్యలో జరిగాయి. బొమ్మల ఆర్డర్స్‌ అయితే 245 శాతం మేర, ఎలక్ర్టాన్స్‌ ఉపకరణాల్లో 223 శాతం మేర వృద్ధి నమోదైంది.


ఉదయం ఉల్లిపాయలు, టమాటాలు

ఏ సమయంలో ఎక్కువుగా ఆర్డర్స్‌ చేస్తున్నారన్నదానిపై కూడా ఇన్‌స్టామార్ట్‌ తన నివేదికలో పొందుపరిచింది. ఉదయం సమయంలో భారీగా ఆర్డర్స్‌ ఇస్తున్న వాటిల్లో ఉల్లిపాయలు, టమాటాలు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, బంగాళాదుంపలు వంటివి ఉంటున్నాయి. ఈ ఏడాది వీటి ఆర్డర్లు కూడా పెద్దఎత్తున పెరిగాయి. ఇక రోజువారీ స్నాక్స్‌ ఆర్డర్లలో థమ్స్‌అప్‌, లేస్‌, బింగో, కుర్కురే, బిస్లరీ వంటివి జోరు కొనసాగిస్తున్నాయి. నూనెల విషయంలో.. దుర్గానెయ్యి, నువ్వుల నూనె, వేరుశనగనూనెల ఆర్డర్స్‌ అధికంగా ఉన్నాయి. ఆకుకూరల్లో చుక్కకూరను ఎక్కువుగా విజయవాడ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో కోకోకోలాలు, చాక్లెట్స్‌, క్రంచీ స్నాక్స్‌ ఎక్కువుగా ఆర్డర్‌ చేస్తున్నారు.

కొనుగోళ్లలో రికార్డు

విజయవాడలో వ్యక్తిగతంగా ఎంత ఖర్చు చేస్తారన్నదానిపై కూడా ఇన్‌స్టామార్ట్‌ తన నివేదికలో వివరించింది. ఒక వ్యక్తి 2025 సంవత్సరంలో రూ. 3.62 లక్షల మేర కొన్నాడు. రోజువారీ కొనుగోళ్లతో అంత ఖర్చు చేశాడు. హైదరాబాద్‌ నగరంలో ఒక వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.3 లక్షలు కొనడం దేశంలోనే అత్యధికంగా నిలిచింది. అయితే ఆ వినియోగదారుడు మూడు ఐ ఫోన్లను కొనుగోలు చేయడంతో అంత ఖర్చు అయింది. ఇక బెజవాడ వినియోగదారుడు మాత్రం ఏడాది పొడవునా షాపింగ్‌ చేయటం విశేషం. విజయవాడలో మరో ముగ్గురు కొనుగోలుదారులు ఏడాదిలో రూ. 3 లక్షలకుపైగా కొనుగోలు చేశారని ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది.

Updated Date - Dec 24 , 2025 | 04:18 AM