Share News

Opposition Protests: జీ రామ్‌ జీ పాస్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:08 AM

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘వీబీ జీరామ్‌జీ’ బిల్లు ఎనిమిది గంటల చర్చ అనంతరం, విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే గురువారం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది....

Opposition Protests: జీ రామ్‌ జీ పాస్‌

  • లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

  • బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన

  • పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ

  • బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం: ఖర్గే

  • 27న సీడబ్ల్యూసీ భేటీ.. బిల్లుపై చర్చ

  • విపక్షాల తీరు అవమానకరంగా ఉంది

  • వారు ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యంగా మార్చేశారు: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 18: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘వీబీ జీరామ్‌జీ’ బిల్లు ఎనిమిది గంటల చర్చ అనంతరం, విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే గురువారం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును సూక్ష్మ పరిశీలన నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేయగా.. స్పీకర్‌ ఓంబిర్లా నిరాకరించారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిందని, అన్నీ పార్టీలకూ చెందిన 98 మంది ఎంపీలు దీనిపై బుధవారం అర్ధరాత్రి దాకా మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. కాగా.. రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ చట్టంలోని లోపాలను సవరించేందుకే ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రె్‌సపైన.. తాను మాట్లాడుతున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బిల్లు కాపీలను చించేస్తున్న విపక్ష ఎంపీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహాత్ముడి ఆదర్శాలను పలుమార్లు హత్య చేసిన ఆ పార్టీ ఆయన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటోందని దుయ్యబట్టారు. సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యుల తీరు అవమానకరంగా ఉందని, వారు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యంగా, గూండాగిరీగా మార్చేశారని నిప్పులు చెరిగారు. విపక్ష సభ్యులు పేరు మార్పుపై దృష్టి సారిస్తే.. తాము అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ‘‘బిల్లుపై చర్చ సందర్భంగా వారు పేపర్లు చించారు. బల్లలపైకి ఎక్కి నిలబడ్డారు. బాపూజీయే ఉండి ఉంటే ఈ తరహా అవమానకరమైన ప్రవర్తనను అనుమతించేవారా?’’ అని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం అవినీతితో నిండిపోయిందని.. రాష్ట్రాలు ఆశించినట్టుగా నిధులను కేటాయించలేదని ఆరోపించారు. ‘‘ఉపాధిహామీ చట్టం ప్రకారం 60ు నిధులను కార్మికులపై, 40ు నిధులను మెటీరియల్‌పై ఖర్చు చేయాలి. కానీ, 26ు నిధులే మెటీరియల్స్‌పై ఖర్చు చేశారు.


నిధులన్నీ దోచేశారు’’ అని చౌహాన్‌ నిప్పులు చెరిగారు. రూ.10-11 లక్షల కోట్లను వేతనాల రూపం లో ఖర్చు చేసే కన్నా.. శాశ్వత ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే విస్తృత చర్చలు జరిపి ‘వీబీ-జీరామ్‌జీ’ బిల్లును తీసుకొచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. ‘‘గాంధీజీ పేరు చెప్పి ఏడుస్తున్న విపక్ష సభ్యులు.. ‘స్వాతంత్య్రం వచ్చేసింది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీని ఇక రద్దుచేయాలి. దాని స్థానంలో ‘లోక్‌ సేవక్‌ సంఘ్‌’ను ఏర్పాటు చేయాలి’ అంటూ అప్పట్లో బాపూజీ చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. గాంధీజీ చెప్పినా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి, స్వాతంత్ర్యోద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకే నెహ్రూజీ కాంగ్రె్‌సను రద్దు చేయలేదని చౌహాన్‌ ఆరోపించారు. ఉపాధి హామీ చట్టానికి వారు తొలుత మహాత్మాగాంధీ పేరే పెట్టలేదని.. కేవలం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)’ అని మాత్రమే పెట్టారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. 2009లో సార్వత్రిక ఎన్నికలప్పుడు.. ఓట్లు పొందడానికి కాంగ్రెస్‌ పార్టీ బాపూజీని గుర్తుచేసుకుందని దుయ్యబట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం 100 రోజులున్న ఉపాధి రోజులను తాము ఈ బిల్లుతో 125 రోజులకు పెంచామని.. ఇందుకోసం అదనంగా రూ.1,51,282 కోట్లను ప్రతిపాదించామని మంత్రి వివరించారు. అందులో రూ.95 వేల కోట్లు కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ కొత్త పథకం ద్వారా ఒకవైపు ప్రజలకు ఉపాధి కల్పిస్తూనే.. మరోవైపు పూర్తి గ్రామాన్ని, అభివృద్ధి చెందిన గ్రామాన్ని, అందరికీ ఉపాధి ఉన్న గ్రామాన్ని, పేదరికంలేని గ్రామాన్ని నిర్మిస్తామన్నారు. ఆ గ్రామంలో.. బడి, ఆరోగ్య కేంద్రం, జలాశయం, అంగన్‌వాడీ సెంటర్‌, ఉపాధి పనులు, రహదారులు అన్నీ ఉంటాయని చౌహాన్‌ వివరించారు.


ఢిల్లీ నుంచి గల్లీ దాకా..

ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తూ తెచ్చిన జీరామ్‌జీ బిల్లును వ్యతిరేకిస్తూ పలువురు విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘మహాత్మాగాంధీ నరేగా’ అని ఉన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శిస్తూ వారు ప్రేరణస్థల్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి మకరద్వారం వరకూ ర్యాలీగా వెళ్లారు. మకరద్వారం వద్ద సోనియాగాంధీ వారితో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకమైన మన్రేగాకు క్రమంగా స్వస్తి చెప్పడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని.. ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఆయనతోపాటు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, డీఎంకే ఎంపీలు కనిమొళి, టీఆర్‌ బాలు, ఎ.రాజా, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ సర్కారు మహాత్మాగాంధీని అవమానించడమేకాక.. భారతీయ గ్రామాల్లో సామాజిక-ఆర్థిక పరివర్తనకు కారణమైన ఉపాధి హక్కును కాలరాసిందని ‘ఎక్స్‌’ వేదికగా ఖర్గే విమర్శించారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాము ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కాగా.. మన్రేగాను తొలగించి దాని స్థానంలో మోదీ సర్కారు కొత్త బిల్లును తేవడంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఈ నెల 27న భేటీ కానున్నట్టు సమాచారం. 2026 తొలిసగంలో అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబంధించిన వ్యూహరచనలో ఈ భేటీ కీలకం కానుంది.

Updated Date - Dec 19 , 2025 | 06:15 AM