VB G Ram G Scheme: ఉపాధికి మరింత గ్యారంటీ
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:40 AM
దేశంలో కోట్లాది మంది గ్రామీణ పేదలు, కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం....
జీ రామ్ జీ పథకం ద్వారా పని దినాల పెంపు
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకం
వీబీ- జీ రామ్ జీ పథకంపై వివరణ ఇచ్చిన కేంద్రం
బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా అవతరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 21: దేశంలో కోట్లాది మంది గ్రామీణ పేదలు, కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చటంతోపాటు అందులో కొన్ని మార్పులు కూడా చేయటంపై పార్లమెంటులో ఇటీవల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఈ పథకాన్ని మోదీ సర్కారు ‘వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’గా మార్చింది. దీనినే సంక్షిప్తంగా ‘వీబీ- జీ రామ్ జీ’గా పిలుస్తున్నారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోదముద్ర వేయటంతో చట్టంగా మారింది. కేంద్రం ఈ పథకం అసలు ఉద్దేశాన్ని చంపేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా పథకంలో మార్పులు చేశామని మోదీ సర్కారు చెబుతోంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కంటే ఇది ఉత్తమమైనదని వాదిస్తోంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కంటే జీ రామ్ జీ ఎందుకు ఉత్తమమైదో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక నోట్‌ను విడుదల చేసింది. అందులోని వివరాలు ఇవీ....
1.వీబీ- జీ రామ్ జీ బిల్ -2025 అంటే ఏమిటి?
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ చట్టంలో సంస్కరణలు చేస్తూ తీసుకొచ్చిందే వీబీ- జీ రామ్ జీ బిల్-2025. వికసిత్ భారత్-2047 మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆధునిక కార్యక్షేత్రాన్ని నిర్మించటమే దీని లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం సంవత్సరంలో 125 రోజులు ఉపాధికి హామీ ఇస్తుంది.
2. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏతో పోల్చితే వీబీ- జీ రామ్ ఏ విధంగా మెరుగైనది?
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ద్వారా ఒక వ్యక్తికి సంవత్సరంలో 100 రోజులు ఉపాధికి హామీ లభించగా, వీబీ- జీ రామ్ జీ 125 రోజుల ఉపాధికి హామీ ఇచ్చింది. పాత పథకం మాదిరిగా కాకుండా ఈ కొత్త పథకం బలమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ప్రధానంగా ప్రజలకు నీటి భద్రత, గ్రామీణ ప్రధాన మౌలిక వసతులు, జీవనోపాధి మౌలిక వసతులు, వాతావరణ పరిస్థితులను స్థిరీకరించే (వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను నిరోధించటం) పనులు అనే 4 అంశాలపై దృష్టి పెట్టింది.
3. కొత్త పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తుంది?
ఈ పథకం చెరువులు, కుంటల వంటి నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. మిషన్ అమృత్ సరోవర్ ద్వారా దేశవ్యాప్తంగా 68,000 పైచిలుకు నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వ్యవసాయానికి నీటి వసతితోపాటు భూగర్భ జల మట్టం పెంచేందుకు వీలు కల్పిస్తుంది. పక్కా రోడ్లు, గ్రామాల అనుసంధానం, అత్యవసరమైన సేవల కల్పన ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తుంది. ఉపాధికి హామీ ఇవ్వటం ద్వారా కరువు కారణంగా ఏర్పడే ప్రజల వలసలను నిరోఽధిస్తుంది. డిజిటల్ హాజరు, కూలీలకు నేరుగా వేతనాల చెల్లింపు, డాటా ఆధారిత ప్రణాళికల ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతుంది.
4. కొత్త పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పంటలు వేసే, కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పనులును నిలిపివేసే అవకాశం ఈ పథకం కల్పిస్తుంది. తద్వారా కూలీ రేట్ల కృత్రిమ పెంపును నిరోధించవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించవచ్చు. చెరువులు, కుంటల వంటి నీటి వసతులను పునరుద్ధరించటం, కొత్తవి ఏర్పాటు చేయటం ద్వారా ఒకటికంటే ఎక్కువ పంటలు పండించవచ్చు.
5. కూలీలకు ఈ పథకం ద్వారా లాభమేంటి?
కూలీలకు ఏటా 125 రోజులు ఉపాధికి హామీ ఇవ్వటం ద్వారా వారి ఆదాయాన్ని 25 శాతం పెంచుతుంది. నిర్ణీత సమయంలో కూలీలకు ఉపాధి కల్పించలేకపోతే రాష్ట్రాలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
6. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటి?
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని 2005 నాటి భారత గ్రామీణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఆ తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు గ్రామాల్లో బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ ఉంది. కనెక్టివిటీ పెరిగింది. డిజిటల్ సేవలు పెరిగాయి. గ్రామాణ జీవనోపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అందువల్ల ప్రస్తుత గ్రామీణ పరిస్థితులకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం పనికిరాదు.
7. కొత్త చట్టంలో పారదర్శకత, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి?
మోసాలను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ. పథకంపై పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్రాల సంయుక్త స్టీరింగ్ కమిటీ. పథకంపై గ్రామ పంచాయతీ పర్యవేక్షణ అధికారాలను విస్తృతం చేయటం. జీపీఎస్, మొబైల్ ఆధారిత పర్యవేక్షణ.
8. రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందా?
పథకం అమలులో కేంద్ర, రాష్ట్రాలు వ్యయాన్ని 60:40 శాతం భరించాలి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాయల పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది.