Applicants with Diabetes and Obesity: మధుమేహం, ఊబకాయం ఉంటే..అమెరికా వీసా కష్టమే!
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:00 AM
మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం కానుంది..
ఎంబసీలు, కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు
గుండె జబ్బులు, శ్వాస సమస్యలు ఉన్నవారికీ ఇబ్బందే
‘కేఎ్‌ఫఎఫ్ హెల్త్ న్యూస్’ వెల్లడి
వాషింగ్టన్, నవంబరు 7: మధుమేహం (షుగర్), ఊబకాయం (ఒబేసిటీ) వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం కానుంది. గుండె జబ్బులు, తీవ్ర శ్వాస సమస్యలు ఉన్నవారికీ వీసా నిరాకరించే అవకాశం పెరగనుంది. ఈ మేరకు విదేశీయులెవరైనా అమెరికా వీసా పొందడం కోసం ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిశీలన నిబంధనల్లో ఆ దేశ విదేశాంగ శాఖ మార్పులు చేసింది. ఇకపై మధుమేహం, ఊబకాయం అంశాలనూ పరిశీలన జాబితాలో చేర్చింది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లకు నూతన మార్గదర్శకాలు వెళ్లాయని ఆ దేశానికి చెందిన ‘కేఎ్‌ఫఎఫ్ హెల్త్ న్యూస్’ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ ఒబేసిటీ రాజధానిగా మారిన అమెరికాలోకి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు రాకుండా నియంత్రించడం, అక్కడి ప్రభుత్వానికి భారంగా కాకుండా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఒకవేళ అమెరికాలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందాల్సి వచ్చే పరిస్థితిలో ఉన్నవారికి కూడా వీసా రావడం కష్టమేనని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఎంబసీలు, కాన్సులేట్ల అధికారులకు జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో.. ‘‘వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. గుండె జబ్బులు, తీవ్ర శ్వాస సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. వాటి చికిత్సకు వందలు, వేల డాలర్ల వ్యయం అవుతుంది. వారు అమెరికాలోకి వచ్చాక ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తే తీవ్ర భారం పడుతుంది. అలాంటి వారికి వీసా నిరాకరించాలి. ఒకవేళ దరఖాస్తుదారులకు తమ వ్యాధుల చికిత్స, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని పూర్తిగా భరించగల ఆర్థిక స్థోమత ఉంటే పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక వీసా దరఖాస్తుదారుల కుటుంబ సభ్యుల (డిపెండెంట్లు)లో ఎవరికైనా తీవ్ర వ్యాధులు, వైకల్యాలు ఉన్నాయా అన్నదీ పరిశీలించాలి’’ అని విదేశాంగ శాఖ ఆదేశించింది. అమెరికాలోకి వలసలను నిరుత్సాహపర్చడం కోసమే మార్గదర్శకాలను ఇలా విస్తృతం చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.