Share News

Visa Fraud: వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:23 AM

అమెరికా వీసా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. గుండె మరియు పర్యాటక వీసాలపై మోసాలు, అక్రమాలు నమోదు అవుతున్నాయి. వీసా అపాయింట్‌మెంట్లను పరిక్షించడంతో పాటు, అగ్రరాజ్యం దేశాల మధ్య వివరాలను పంచుకుంటుంది.

Visa Fraud: వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర

భారత దేశ అభ్యర్థుల బ్లాక్‌ లిస్టింగ్‌.. మిత్ర దేశాలకూ వివరాలు పంపేచాన్స్‌

విద్యార్థులు, పర్యాటక వీసాలపై డేగకన్ను

ఇప్పటికే 2 వేల మందికి అగ్రరాజ్యం షాక్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర చేసింది. ముఖ్యంగా భారత్‌కు చెందిన దరఖాస్తు దారులు మోసాలకు పాల్పడడంపై విచారణ జరుపుతున్న అగ్రరాజ్యం.. దీనిని మరింత వేగవంతం చేయడంతోపాటు లోతుగా కూడా విచారించనుంది. ఈ క్రమంలో విద్యార్థుల వీసాలతోపాటు పర్యాటకుల వీసాలపైనా డేగకన్ను సారించింది. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను బ్లాక్‌ లిస్టులో పెట్టడంతోపాటు.. వారి వివరాలను తన మిత్ర దేశాలైన బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలతో పంచుకోనుంది. తద్వారా ఆయా దేశాలు కూడా వీరికి వీసాలు ఇవ్వకుండా, వారిని బ్లాక్‌లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోనుంది. వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2 వేల మందికి గత నెలలో అప్పాయింట్‌మెంట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో ట్రావెల్‌ ఏజెంట్లు సహా దరఖాస్తు దారులపై విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణను మరింత విస్తరించింది. అమెరికా వీసా అప్పాయింట్‌మెంట్‌ వ్యవస్థతో ఆడుకున్న వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలి పెట్టబోమని దౌత్యకార్యాలయ అధికారి ఒకరు హెచ్చరించారు. ‘‘ఇప్పటి వరకు విద్యార్థి వీసాల విషయంలోనే అక్రమ అప్పాయింట్‌మెంట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అయితే, పర్యాటక వీసాల అప్పాయింట్‌మెంట్స్‌లోనూ అక్రమాలు జరిగాయని గుర్తించాం. వాటిపై కూడా చర్యలు తీసుకోనున్నాం’’ అని ఆ అధికారి తెలిపారు.

ముందస్తు తేదీలతో మోసం!

కరోనా అనంతరం.. దేశవ్యాప్తంగా అన్ని కాన్సులేట్స్‌లో వీసా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. చెన్నైలోని కాన్సులేట్‌లో పర్యాటక వీసా(బీ-1/బీ-2) అప్పాయింట్‌మెంటు కోసం ప్రస్తుతం 440 రోజుల నిరీక్షణ కొనసాగుతోంది. 2023 అక్టోబరు-2024 సెప్టెంబరు మధ్య ఢిల్లీ దౌత్య కార్యాలయం సహా చెన్నై, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా కాన్సులేట్స్‌ 13.75 లక్షల వీసాలను మంజూరు చేశాయి. వీటిలో 9 లక్షల వీసాలు కేవలం పర్యాటకానికి సంబంధించినవే కావడం విశేషం. ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది.

gkm.jpg

కాగా.. డిమాండ్‌కు తగిన విధంగా వీసాలను మంజూరు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో దీనిని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న వీసా ఏజెంట్లు.. ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల చొప్పున వసూలు చేసి ముందస్తు తేదీలతో కూడిన దరఖాస్తులతో అభ్యర్థులను మోసం చేశారు.


ఈ పిల్లల పరిస్థితేంటి?

మరోవైపు, అమెరికాలోని హెచ్‌-1బీ వీసా దారుల పిల్లలకు పెద్దకష్టమే వస్తోంది. హెచ్‌-1బీ వీసాలపై అగ్రరాజ్యంలో నివసిస్తున్నవారి పిల్లలకు 21 ఏళ్ల వయసు వస్తే.. వారిని మేజర్లుగా గుర్తిస్తారు. దీంతో ఇప్పటి వరకు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఇచ్చిన ‘హెచ్‌-4’ వీసాలు చెల్లుబాటు కావు. ఈ నేపథ్యంలో వారు కొత్త చట్టపరమైన అవకాశాలను వెతుక్కోవడమో.. లేక దేశం విడిచి వెళ్లడమో చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే.. 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల వరకు వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉందని, కానీ రూల్స్‌ మారుతుండటంతో అనిశ్చితి నెలకొందని అన్నారు.


ట్రంప్‌పై అమెరికా వర్సిటీల నిరసనాస్త్రం

విద్యా రంగం స్వేచ్ఛ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని యూనివర్సిటీలు ఏకం అవుతున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఫెడరల్‌ పరిశోధన నిధుల నిలిపివేతకు గురైన హార్వర్డ్‌ యూనివర్సిటీకి బాసటగా నిలిచాయి. 2.2 బిలియన్‌ డాలర్ల నిధులను స్తంభింపజేయడానికి వ్యతిరేకంగా హార్వర్డ్‌ వర్సిటీ ఇప్పటికే ట్రంప్‌ సర్కార్‌పై దావా వేసిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వ విధానాలను విమర్శించిన లేదా వ్యతిరేకించిన యూనివర్సిటీలే టార్గెట్‌గా ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని, రాజకీయ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. హార్వర్డ్‌ వేసిన దావా యూనివర్సిటీల్లో కదలిక తెచ్చింది. ట్రంప్‌ సర్కార్‌ ఎన్నడూలేని విధంగా పాల్పడుతున్న ‘ప్రభుత్వ అతిక్రమణ’ను ఖండిస్తూ 150కి పైగా యూనివర్సిటీ ప్రెసిడెంట్లు తమ సంతకాలతో ఒక సంయుక్త లేఖను విడుదల చేశారు. ట్రంప్‌ నుంచి విద్యా రంగ స్వేచ్ఛ, సంస్థాగత స్వయంప్రతిపత్తిని ఉమ్మడిగా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఫెడరల్‌ ఫండింగ్‌ ద్వారా యూనివర్సిటీల పాలసీలను ప్రభావితం చేయాలని ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి పునాది అయిన లిబరల్‌ ఎడ్యుకేషన్‌ సూత్రాలకు ప్రత్యక్ష బెదిరింపు అని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణాత్మకమైన సంస్కరణకు యూనివర్సిటీలు సిద్ధంగానే ఉన్నాయని, అయితే రాజకీయ అజెండాకు అనుగుణంగా బలవంతం చేయకూడదని లేఖ స్పష్టం చేసింది. ఈ విధమైన వైఖరి విద్యాసంస్థల ప్రధాన విలువలను దెబ్బతీస్తాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:23 AM