Share News

US Immigration: హెచ్‌1బీ వీసాలు తాత్కాలిక రద్దు

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:08 AM

విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది....

US Immigration: హెచ్‌1బీ వీసాలు తాత్కాలిక రద్దు

  • అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఈమెయిల్స్‌

  • హెచ్‌4 వీసాదార్లకు కూడా..

  • వారి ‘సోషల్‌’ ఖాతాల తనిఖీ కోసమేననే వాదనలు

  • భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం

న్యూఢిల్లీ, డిసెంబరు 14: విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో హెచ్‌1బీ, హెచ్‌4 వీసాలతో పనిచే స్తున్న కొందరు ఉద్యోగులకు.. వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్స్‌ పంపింది. అయితే, వీసాలు తాత్కాలికంగా రద్దయినా ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసేవరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్‌ అటార్నీ ఎమిలీ న్యూమన్‌ తెలిపారు. హెచ్‌1బీ, హెచ్‌4 వీసాదారుల సోషల్‌ మీడియా కార్యకలాపాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను కూడా అమెరికా అధికారులు వాయిదా వేశారు. దరఖాస్తుదారులతోపాటు వారి కుటుంబసభ్యులకు చెందిన గత ఐదేళ్ల సోషల్‌ మీడియా యాక్టివిటీ వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వీసాలు ఉన్నవారిని కూడా అలాగే అడగబోతున్నారని న్యూమన్‌ తెలిపారు. వీసాలు తాత్కాలికంగా రద్దయిన వారు అమెరికాలో ఉన్నంతకాలం సమస్య లేదని, దేశం బయటకు వెళ్లి, తిరిగి రావాలంటే మాత్రం సాధ్యం కాదని రెడ్డి న్యూమన్‌ బ్రౌన్‌ పీసీ అనే ఇమిగ్రేషన్‌ న్యాయ సంస్థ తెలిపింది. కాగా, ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితం అయ్యేది భారతీయులేననే వాదన వినిపిస్తోంది. హెచ్‌1బీ, హెచ్‌4 వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. వీసాల తాత్కాలిక రద్దు వల్ల వారు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా స్వదే శానికి రాలేని పరిస్థితిలో పడిపోయారు. ఒకవేళ వస్తే.. తిరిగి అమెరికా వెళ్లటం కష్టమవుతుంది. తిరిగి వెళ్లాలంటే సుదీర్ఘకాలం వేచి ఉండటంతోపాటు మళ్లీ కొత్త వీసా పొందినంత పని అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 04:08 AM