Share News

US Response: పహల్గాంపై అమెరికా డబుల్‌ గేమ్‌

ABN , Publish Date - May 03 , 2025 | 04:08 AM

పహల్గాం ఉగ్రదాడిపై అమెరికా ద్వంద్వ వైఖరిని నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. భారత్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, సంయమనాన్ని సూచించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

US Response: పహల్గాంపై అమెరికా డబుల్‌ గేమ్‌

భారత్‌కు మద్దతని ఓ వైపు ప్రకటన

కానీ, నేతల వ్యాఖ్యలు తటస్థం

భారత్‌-పాకిస్థాన్‌ సంయమనం

పాటించాలని అగ్రనేతల కబుర్లు

పహల్గాం దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగాలని భావిస్తే.. భారత్‌ దానిని నివారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యానించారు. ఫాక్స్‌ న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చర్యలు తీసుకున్నప్పటికీ.. అది విస్తృత సంఘర్షణలకు దారితీయని భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను గుర్తించే క్రమంలో భారత్‌కు ఆ దేశం సహకరించాలి. ఈ విషయంలో పాక్‌ సహకరిస్తుందనే ఆశిస్తున్నాం’’ అని వాన్స్‌ అన్నారు.

భారత్‌ యుద్ధాన్ని నివారించాలి: వాన్స్‌

న్యూఢిల్లీ, మే 2: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఒకవైపు భారత్‌కు అన్ని విధాలా మద్దతు ప్రకటిస్తున్నామని చెబుతూనే.. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ సహా ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు డబుల్‌ గేమ్‌ను తలపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్‌, పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తుల్సి గబ్బార్డ్‌ మాత్రం ఉగ్రవాదుల ఏరివేతలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ట్రంప్‌ 2.0 ప్రభుత్వం బలమైన సంకేతాలు పంపిస్తుందని భావించినా.. ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ వైఖరి రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయిందని నిపుణులు చెబుతున్నారు. కశ్మీర్‌ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వం చేస్తానని తన తొలి పాలనలో ప్రకటించిన ట్రంప్‌..


‘‘కశ్మీర్‌ విషయాన్ని ఆ రెండు దేశాలే ఏదో ఒక మార్గంలో పరిష్కరించుకుంటాయి. నాకు భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ దగ్గరే. వారే ఏదో ఒక మార్గం ఎంచుకుంటారు.’’ అని గత వారం వ్యాఖ్యానించారు. భద్రతా సంబంధిత మినహాయింపుల్లో భాగంగా ఇటీవల 5.3 బిలియన్‌ డాలర్లను మంజూరు చేశారు. అదేవిధంగా ఎఫ్‌-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం 400 మిలియన్‌ డాలర్లకు ఆమోదం తెలిపారు. చిత్రం ఏంటంటే.. తన తొలిపాలనలో పాకిస్థాన్‌పై ట్రంప్‌ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉగ్రవాదులకు ఆ దేశం స్వర్గధామంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు 1.3 బిలియన్‌ డాలర్ల భద్రతా సాయాన్ని నిలుపుదల చేశారు.

భారత్‌కు సంయమన మంత్రం

పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌.. సంయమనం పాటించాలని సూచించారు. నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగి, 26 మంది మృతి చెందిన సమయంలో ఆయన కుటుంబంతో సహా భారత్‌లోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన భారత్‌ సంయమనం పాటించాలని చెప్పడం గమనార్హం. ఇదేసమయంలో ‘‘పాక్‌ తన బాధ్యత మేరకు నడుచుకోవాలి.’’ అని ఊరుకున్నారు. కాగా, భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రికతత నేపథ్యంలో పరిస్థితులపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి త్వరలో సమావేశం కానుంది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 04:08 AM