మహిళలూ భారత్‌కు ఒంటరిగా వెళ్లొద్దు
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:24 AM
భారత్‌కు వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ చేసింది. లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల చేసింది.
అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయ్
అమెరికా హెచ్చరిక
గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచన
ఉత్తర తెలంగాణ పేరు ప్రస్తావన
న్యూఢిల్లీ, జూన్ 21: భారత్‌కు వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ చేసింది. లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల చేసింది. నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘‘భారత్‌లో మానభంగాలు చాలా వేగంగా పెరుగుతున్న నేరంగా మారింది. కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి’’ అని తెలిపింది. ఒంటరిగా ప్రయాణించకూడదని, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని స్పష్టం చేసింది. భారత్‌లో పని చేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాలను చేర్చింది. జమ్మూ-కశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే ఫరవా లేదని, గ్రామీణ ప్రాంతాలకు వద్దని పేర్కొంది.