H1B visa: మనమే రూటు మారుద్దాం!
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:59 AM
అనుకున్నదే అవుతోంది. భారత్‌ను బెదిరించడానికో.. లేక నిజంగానే అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలపడానికో.. అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనో..
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో భారత్‌లోని జీసీసీలవైపు అమెరికా దిగ్గజ కంపెనీల చూపు
ఇక్కణ్నుంచీకార్యకలాపాలను పెంచే ప్రణాళికలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: అనుకున్నదే అవుతోంది. భారత్‌ను బెదిరించడానికో.. లేక నిజంగానే అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలపడానికో.. అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనో.. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది! ఎందుకంటే.. వ్యాపారాలకు సెంటిమెంట్లు కాదు.. లాభాలే ముఖ్యం. ఈ క్రమంలోనే.. చాలావ రకూ అమెరికా కంపెనీలు ఈ అడ్డంకిని అధిగమించేందుకు దారులు వెతుకుతున్నాయి. ‘ట్రంప్ ఇక్కడికి ఉద్యోగుల్ని రానివ్వకపోతే.. మనమే ఉద్యోగులు ఎక్కువగా దొరికే చోటుకు వెళ్దాం’ అనుకుంటున్నాయి. అందులో భాగంగా.. భారత్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీల) నుంచి (ఆఫ్‌షోర్) కార్యకలాపాలను క్రమంగా పెంచుతున్నాయి. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో సగానికిపైగా.. అంటే 1700 జీసీసీలు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. ఐటీ, కృత్రిమ మేధ నుంచి ఔషధాలు, టీకాల అభివృద్ధి దాకా ఎన్నో రంగాలకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు మనదేశంలో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, గుర్గావ్ వంటి నగరాలు ఈ జీసీసీలకు కేంద్రాలుగా ఉన్నాయి. గూగు ల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గోల్డ్‌మ్యాన్ శాక్స్, జేపీమోర్గాన్, షెల్, జీసీ, సీమన్స్, బోష్ వంటి దిగ్గజ సంస్థలు మనదేశంలో పెద్ద ఎత్తున జీసీసీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అమెజాన్‌కైతే ప్రపంచంలోనే అతిపెద్ద జీసీసీ మనదేశంలోనే (అమెజాన్ ఇండియా డెవల్‌పమెంట్ సెంటర్) ఉంది. జీసీసీలంటే కేవలం ఔట్‌సోర్సింగ్ కేంద్రాలు కావు. ప్రొడక్ట్ డెవల్‌పమెంట్ నుంచి అత్యంత అధునాతన పరిశోధనల దాకా అన్ని కార్యకలాపాలూ జరుగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను నిరంతరాయంగా నిర్వహించుకోవడానికి కంపెనీలు ఏర్పాటు చేసుకునే వ్యవస్థలివి. బెంగళూరులో అత్యధికంగా ఐటీ జీసీసీలు ఉండగా.. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డేటా, ఏఐ కంపెనీలకు సంబంధించిన జీసీసీలున్నాయి. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు కలిగిన సిబ్బంది దొరకడం భారత్‌లో సులువు కాబట్టే కంపెనీలు వాటిని ఇక్కడ ఏర్పాటుచేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో.. ఇప్పుడా కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను ఈ జీసీసీల ద్వారా మరింత విస్తరించుకునే ప్రణాళికల్లో ఉన్నాయని డెలాయిట్ ఇండియాకు చెందిన రోహన్ లోబో తెలిపారు. నిజానికి ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజుల పెంపు నిర్ణయంతో సంబంధం లేకుండానే భారత్‌లోని జీసీసీల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయని.. 2030 నాటికి ప్రపంచంలోని 2200 కంపెనీల జీసీసీలు ఇండియాలో ఏర్పాటవుతాయని, జీసీసీ మార్కెట్ విలువ 10 వేలకోట్ల డాలర్లకు (దాదాపు రూ.9 లక్షల కోట్లకు) చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అది ఇంకా జోరందుకునే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.