అమెరికా అస్త్రాలివే
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:44 AM
ఇజ్రాయెల్‌కు తోడుగా యుద్ధరంగంలోకి దిగి ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా.. అందుకు ప్రధానంగా ఉపయోగించింది బీ2 స్టెల్త్ బాంబర్లు, జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులనే.
ఇజ్రాయెల్‌కు తోడుగా యుద్ధరంగంలోకి దిగి ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా.. అందుకు ప్రధానంగా ఉపయోగించింది బీ2 స్టెల్త్ బాంబర్లు, జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులనే. వాటి ప్రత్యేకతలివే.. బీ-2 స్పిరిట్ బాంబర్లు: ప్రస్తుతం అమెరికా వద్ద 21 బీ-2 బాంబర్లున్నాయి. శత్రు రేడార్లకు చిక్కకుండా దాడులు చేయగలగడమే వీటి ప్రత్యేకత. రేడార్లు వెలువరించే సంకేతాలను ప్రతిఫలింపజేయకుండా వాటిని శోషించుకునే శక్తి వీటికి అత్యధికంగా ఉండడమే ఇందుకు కారణం. అలా రేడార్ సంకేతాలను ప్రతిఫలింపజేసే శక్తినే ‘రేడార్ క్రాస్ సెక్షన్’ అంటారు. దీన్ని స్క్వేర్ మీటర్లలో కొలుస్తారు. రేడార్ క్రాస్ సెక్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ స్టెల్త్ సామర్థ్యం ఉన్నట్టు. బీ2 బాంబర్ల రేడార్ క్రాస్ సెక్షన్ కేవలం 0.0001 స్క్వేర్ మీటర్స్. అంటే.. ్ఞఅంత పెద్ద విమానమూ రేడార్ల దృష్టిలో ఒక పురుగుతో సమానం. సాధారణ విమానాలనైతే రేడార్లు 400 కిలోమీటర్ల దూరంలోనే కనుక్కోగలుగుతాయి. కానీ, బీ2 బాంబర్లను అలా గుర్తించలేవు. అందుకే... ఫోర్డో అణు కేంద్రం వద్ద ఇరాన్ మోహరించిన ఎస్300 రక్షణ వ్యవస్థ వీటిని ఏమీ చేయలేకపోయింది. బీ2 బాంబర్ల రేంజ్.. దాదాపుగా 11,265 కిలోమీటర్లు. మధ్యలో ఒక్కసారి గాల్లోనే ఇంధనం ఎక్కిస్తే.. దాదాపు 18,500 కి.మీ వెళ్లగలవు. వీటి పేలోడ్ సామర్థ్యం దాదాపుగా 18,144 కిలోలు. అందుకే.. అత్యంత బరువైన జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులను వీటి నుంచి ప్రయోగిస్తారు. ఈ బీ2 స్టెల్త్ బాంబర్లను అమెరికా తొలిసారి 1999లో కొసావో యుద్ధంలో ఉపయోగించింది. చివరిసారిగా.. కిందటి సంవత్సరం అక్టోబరులో యెమెన్‌లోని హూతీ రెబెల్స్ తలదాచుకున్న అండర్‌గ్రౌండ్ బంకర్లపై దాడికి వాడింది. ఇరాక్, అఫ్ఘానిస్థాన్, లిబియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో అమెరికా వీటిని ఉపయోగించింది. అయితే.. ఒక్కో బీ2 బాంబర్ తయారీకీ దాదాపు 200 కోట్ల డాలర్ల దాకా (దాదాపు రూ.17 వేల కోట్లు) ఖర్చయుంది కాబట్టి.. అమెరికా వీటిని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడుతుంటుంది.
బంకర్ బస్టర్ బాంబులు: జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు.. 20.5 అడుగుల పొడుగు, 31.5 అంగుళాల చుట్టుకొలతతో ఉంటాయి. 13,600 కిలోల బరువు ఉంటాయి. అందులో రెండుటన్నులకు పైగా బరువు పేలుడు పదార్థాలదే (ఒక్కో జీబీయూ-57లో 2,082 కిలోల ఏఎ్‌ఫఎక్స్-757 (ఇది ప్లాస్టిక్ బాండెడ్ ఎక్స్‌ప్లోజివ్), 341 కిలోల పాలిమర్ బాండెడ్ ఎక్స్‌ప్లోజివ్ (పీబీఎక్స్) ఉంటాయి. రెండూ కలిపి 2,423 కిలోలు). ఆ పేలుడు పదార్థం చుట్టూ.. అత్యంత పటిష్ఠమైన, అత్యధిక సాంద్రత కలిగిన ఎగ్లిన్ ఉక్కు లోహ మిశ్రమంతో చేసిన పొర (కేసింగ్) ఉంటుంది. ఒక్కో జీబీయూ-57 తయారీకీ దాదాపు 2 కోట్ల డాలర్ల దాకా ఖర్చవుతుందని అంచనా. వీటిని బీ2 బాంబర్ల నుంచి జారవిడిస్తే.. దాదాపు 200 అడుగుల లోతువరకూ చొచ్చుకుపోయి.. అక్కడ పేలిపోతాయి.
తొమహాక్ క్షిపణులు: ఇరాన్‌పై దాడులకు అమెరికా ఉపయోగించిన తొమహాక్ క్షిపణులు.. దీర్ఘ శ్రేణి సబ్‌సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు. వీటిని యుద్ధనౌకల మీద నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. అత్యంత అధునాతన గైడెన్స్ వ్యవస్థలను కలిగి, తక్కువ ఎత్తులో ప్రయాణించే తోమహాక్ క్షిపణులు.. శత్రు దేశ గగనతల రక్షణ వ్యవస్థలను సులువుగా తప్పించుకోగలవు. బూస్టర్లు లేకుండా 18.4 అడుగుల పొడుగు, 1600 కిలోల బరువు ఉండే ఈ క్షిపణులు.. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో, 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వెళ్లి.. 1600 కిలోమీటర్ల దూరంలోని లక్షాలను సైతం ఛేదిస్తాయి.
యురేనియం శుద్ధి.. అంత వీజీ కాదు!
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనేదే ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ దేశాల పంతం! అందుకే ఈ యుద్ధం.. ఇంత విధ్వంసం!! ఆ అణు కార్యక్రమంలో అత్యంత కీలకమైనది.. యురేనియం. తమ దేశ ఇంధన అవసరాల కోసం, శాంతియుత ప్రయోజనాల రీత్యానే యురేనియం శుద్ధి చేస్తున్నామని ఇరాన్ చెబుతోంది. కానీ.. అణ్వాయుధాల తయారీనే ఇరాన్ అంతిమ లక్ష్యం అని ఆయా దేశాలు భావిస్తున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైనా.. అణ్వాయుధాలు తయారుచేయడానికైనా ముడి యురేనియం పనికి రాదు. దాన్ని శుద్ధి చేయాలి. ఎందుకు శుద్ధి చేయాలంటే.. సాధారణంగా భూమిలో లభించే యురేనియంలో యూ238 అనే రేడియోధార్మిక ఐసోటోపు 99.27 శాతం ఉంటుంది. మిగిలిన 0.7 శాతం యూ235 అనే రేడియోధార్మిక ఐసోటోపు. వీటిలో అణ్వాయుధాల తయారీకి కావాల్సింది యూ235 ఐసోటోప్.. భూమిలో లభించిన సాధారణ యురేనియంలో నుంచి యూ238ను విడగొట్టి యూ235ను తీయాలంటే.. దాన్ని శుద్ధి చేయాలి. అలా 93.5 శాతం శుద్ధి చేస్తే.. దాన్ని ‘వెపన్ గ్రేడ్’ యురేనియం అంటారు. అలా చేయడానికి యురేనియంను చిలకడం ఒక్కటే మార్గం. అందుకు యురేనియంని రకరకాల రసాయన ప్రక్రియలకు గురి చేసి.. చివరి దశలో ఎలిమెంటల్ ఫ్లోరిన్‌ను కలిపి యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువుగా మారుస్తారు. ఆ వాయువును చిలకడానికే సెంట్రీఫ్యూజుల్ని వాడతారు. ఇవి నిమిషానికి దాదాపు లక్ష చుట్లు తిరుగుతాయి. ఇవి ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండడం వల్ల యు238 పైభాగంలోకి వచ్చేసి.. యూ235 సెంట్రీఫ్యూజ్‌ల మధ్యభాగంలో పోగుపడుతుంది. సాంకేతికంగా చూస్తే.. 20 శాతం యు235తో కూడా అణ్వాయుధాన్ని తయారుచేయవచ్చని, కానీ యురేనియంని ఎంత శుద్ధి చేస్తే బాంబు అంత తేలిగ్గా, చిన్నగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతారు.