Civil Services: యూపీఎస్సీ ప్రతిభా సేతు
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:51 AM
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. అన్ని దశల్లోనూ మెరిట్‌లో ఉన్నా.. స్వల్ప స్కోరు తేడాతో ఆయా పోస్టుల ఎంపిక తుది జాబితాలో చోటు దక్కని అభ్యర్థులకు శుభవార్త..!
అన్ని పరీక్షల్లో పాసైనా.. సర్వీసులకు
ఎంపిక కాని అభ్యర్థుల వివరాలతో డేటాబేస్
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు డేటా యాక్సెస్
దాని ద్వారా ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు
యూపీఎస్సీ ప్రయత్నాన్ని ప్రశంసించిన మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 31: యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. అన్ని దశల్లోనూ మెరిట్‌లో ఉన్నా.. స్వల్ప స్కోరు తేడాతో ఆయా పోస్టుల ఎంపిక తుది జాబితాలో చోటు దక్కని అభ్యర్థులకు శుభవార్త..! ఇలాంటి అభ్యర్థులు ఎంపిక కాకపోయినా.. ప్రతిభావంతులేనని పేర్కొంటూ యూపీఎస్సీ తాజాగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను ప్రారంభించింది. స్వల్ప స్కోరు తేడాతో తుది జాబితాలో చోటు దక్కని 10 వేల మంది అభ్యర్థుల డేటాబేస్‌ను ఆ పోర్టల్‌లో అందుబాటులో పెట్టనుంది. తమ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు/కార్పొరేట్ కంపెనీలకు ఈడేటాబేస్‌ను పరిశీలించే వెసులుబాటు కల్పించింది. అభ్యర్థి పేరు, సెల్‌ఫోన్/ల్యాండ్‌లైన్ కాంటాక్ట్ నంబర్, విద్యార్హతలు వంటి వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. దీంతో.. ఆయా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొలువుల భర్తీలో ‘ప్రతిభా సేతు’లోని అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలుంటాయని ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) తదితర పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చినా.. తుది జాబితాలో చోటు సంపాదించలేని అభ్యర్థుల వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది