University Chancellors Brother Arrested: అల్ ఫలాహ్ వర్సిటీ చాన్స్‌లర్ తమ్ముడు హైదరాబాద్‌లో అరెస్టు
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:57 AM
హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ జావేద్ సిద్దిఖీ సోదరుడు హమూద్ సిద్దిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో...
ఆర్థిక అక్రమాల కేసులో హమూద్ సిద్దిఖీని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
పాతికేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న హమూద్
హైదరాబాద్‌లో షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ జావేద్ సిద్దిఖీ సోదరుడు హమూద్ సిద్దిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో ఆదివారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారుబాంబు పేలుడు కేసులో ఈ యూనివర్సిటీ వైద్యులే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని మౌ పట్టణానికి చెందిన హమూద్ సిద్దిఖీపై 2000 సంవత్సరంలో పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడు పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అతడి సమాచారం తెలిపినవారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని 2019లో పోలీసులు ప్రకటించారు. ఇటీవలఢిల్లీ పేలుడు కేసులో జావేద్‌ను ప్రశ్నించగా హమూద్ తన కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలిసింది. దీంతో నలుగురు సభ్యులతో కూడిన మధ్యప్రదేశ్ పోలీసు బృందం హైదరాబాద్ పోలీసుల సహకారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి హమూద్‌ను అరెస్టు చేశారు. అతడిని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై మధ్యప్రదేశ్‌కు తరలించారు. హమూద్ సిద్దిఖీపై మౌలో అనేక కేసులు ఉన్నాయని మధ్యప్రదేశ్ పోలీస్ అధికారి యాంచెన్ దోల్కర్ భూటియా సోమవారం తెలిపారు. 1995లో హమూద్ సిద్దిఖీ మౌలో ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ ప్రారంభించి స్థానికుల నుంచి పెట్టుబడుల రూపంలో రూ.40 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడని చెప్పారు. హమూద్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా ఒక షేర్ మార్కెట్ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ నడుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ కారు పేలుడు కేసులో సహ కుట్రదారు జసిర్ బిలాల్ వనీ అలియాస్ డాని్‌షను ఎన్‌ఐఏ జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసింది. కారు పేలుడులో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి సన్నిహితుడైన వనీ అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్ వాసి. ఉగ్రదాడులు చేసేందుకు వనీ సాంకేతిక సహకారం అందించాడని, డ్రోన్లను ఆధునీకరించి రాకెట్లుగా మార్చేందుకు యత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.