Uneven Monsoon Causes Floods: ఆడుకుంటున్న రుతుపవనాలు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:31 AM
దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఏకరూపంగా ప్రభావం చూపించడం లేదు. కనీవినీ ఎరుగని భారీవర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు..
దేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు
ఇంకొన్ని చోట్ల వర్షాభావం.. కరువు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఏకరూపంగా ప్రభావం చూపించడం లేదు. కనీవినీ ఎరుగని భారీవర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు, మట్టిచరియలు విరిగిపడుతుండడంతో కొన్ని ప్రాంతాలు అతలాకుతలమవుతుండగా.. ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర వర్షాభావం, కరువుతో అల్లాడుతున్నాయి. వాతావరణ మార్పు దీనికి ప్రధాన కారణమని పలువురు అంటున్నా.. అదొక్కటే కారణం కాదని ఐఐటీ భువనేశ్వర్‌లోని స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్-క్లైమేట్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పట్నాయక్ చెబుతున్నారు. పట్టణ ప్రణాళికలు, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం.. మితిమీరిన కాంక్రీటు వినియోగం కారణంగా వర్షపు నీరు భూమిలో ఇంకకపోవడం.. ఇవన్నీ విపత్తులకు కారణాలేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవన కాలంలో వర్షపాతంలో నాటకీయ మార్పులు కనిపించాయి. వాతావరణ మార్పుల్లో పాశ్చాత్య అవాంతరాల కారణంగా జమ్మూకశ్మీరు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో మెరుపు వరదలు సంభవించాయి. మట్టి, కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్, బిహార్‌లలో భారీవరదలకు చాలా గ్రామాలు కొట్టుకుపోయాయి. వందల మంది గల్లంతయ్యారు. మరోవైపు, గంగా మైదాన ప్రాంతాల్లో జూన్‌లో చుక్క వర్షం పడడం లేదని.. అవి ఎండిపోతున్నాయని.. ఇంకోవైపు.. మధ్యభారతం తడిసిముద్దవుతోందని పట్నాయక్ తెలిపారు. ఆగస్టు నెలలో పలు హిమాలయ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్‌స్టలు సంభవించాయి. ఉత్తరాఖండ్‌లోని ధారలి, జమ్మూకశ్మీరులోని కథువా, హిమాచల్‌లో వ్యవసాయం సర్వనాశనమైంది. ఈ ప్రాంతంలో భారీ ఉష్ణోగ్రతల కారణంగానే వరదలు సంభవించాయని అంటున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు ఆవిరవడం అధికమవుతోంది. ఇది వాతావరణంలో తేమను పెంచుతోంది. మేఘాలు దట్టమై బరువెక్కడంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడేందుకు కారణమవుతున్నాయి. వీట బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ, రుతుపవన వర్షాలు కలిసి.. పర్వతాలపై గాలి వ్యతిరేక దిశలో అపరిమిత వర్షాలకు కారణమవుతున్నాయని.. ఈ కారణంగా కేరళలో కొండచరియలు, మట్టిచరియలు విరిగిపడి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పట్నాయక్ వివరించారు. ఇందులో వాతావరణ మార్పు అనేది ఒక కోణం మాత్రమేనన్నారు.