Bharatanatyam Record: మొక్కవోని నృత్య దీక్ష
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:56 AM
భరత నాట్యం అంటే కేవలం నృత్యమే కాదు.. అకుంఠిత ‘దీక్ష’, భక్తి, తపస్సు కలయిక!.. ఆమెలోని మొక్కవోని దీక్షే 170 గంటల పాత రికార్డును అధిగమించి, కొత్త రికార్డు సృష్టించింది.
ఏకధాటిగా 9 రోజులు.. 216 గంటలపాటు.. నిర్విరామంగా భరత నాట్యం
బెంగళూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): భరత నాట్యం అంటే కేవలం నృత్యమే కాదు.. అకుంఠిత ‘దీక్ష’, భక్తి, తపస్సు కలయిక!.. ఆమెలోని మొక్కవోని దీక్షే 170 గంటల పాత రికార్డును అధిగమించి, కొత్త రికార్డు సృష్టించింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా ఆరూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల వి. విదుషీ దీక్ష నిర్విరామంగా 216 గంటలపాటు భరత నాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో చోటు దక్కించుకున్నారు. రత్నసంజీవ కళా మండలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉడుపిలోని డాక్టర్ జి.శంకర మహిళా ప్రభుత్వ కళాశాల ప్రాంగణం వేదికైంది. ఈ నెల 21వ తేదీన భరతనాట్యం ప్రారంభించిన దీక్ష.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు 216 గంటల ప్రదర్శన పూర్తి చేశారు. గతంలో మంగళూరుకు చెందిన రెమోనో ఇవెట్ పిరేరా పేరిట ఉన్న 170 గంటల రికార్డును అధిగమించారు. తొమ్మిది రోజులపాటు నిరంతర భరతనాట్యం చేయడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పారు. తొలిరోజు ప్రేక్షకులు కొంతమందే ఉన్నా.. ఆ తరువాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పెరుగుతూ వచ్చారు. చివరి రోజు భారీ సంఖ్యలో హాజరై.. ఆమెపై పూలు చల్లి హర్షధ్వానాలు చేశారు. నిర్విరామ భరతనాట్యం అంటే ప్రతి గంటకూ 15 నిమిషాల విరామం ఉంటుంది. ఎనిమిది గంటల ప్రదర్శన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు, ఆహార పానీయాలు తీసుకునేందుకు ఒక గంటపాటు పూర్తి విరామం ఉంటుంది. ఈ ప్రదర్శనకు మణిపాల్‌కు చెందిన రత్న సంజీవ కళాకారులు వాయిద్య సహకారం అందించారు. ప్రదర్శన చివరి రోజు శనివారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై సత్కరించారు. కార్యక్రమంలో దీక్ష నృత్యగురువు విద్వాన్ శ్రీధర్‌రావ్, తండ్రి విఠల్ పూజారి, తల్లి శుభ, భర్త రాహుల్, మాజీ ఎమ్మెల్యే రఘుపతిభట్, పారిశ్రామికవేత్తలు శంకర్, మహేష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
ఆ గాయకుడి రికార్డే స్ఫూర్తి: విదుషీ దీక్ష
విదుషీ దీక్ష వయసు 23 ఏళ్లు. ఆమె బీఎస్సీ పూర్తి చేసి, బీఈడీ కోర్సు చేస్తున్నారు. దీక్ష బాల్యం నుంచే భరతనాట్యం, యక్షగానం, వీణ, మద్దెల వాయించడం నేర్చుకున్నారు. గాయనిగా కూడా గుర్తింపు పొందారు. ‘ఈ ఏడాది జూన్‌లో మంగళూరులో గాయకుడు యశ్వంత్ ఎంజీ ఓ రికార్డు సృష్టించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రమణ్యం పాడిన 270 పాటలను 24 గంటలలో ఆలపించారు. అదే స్ఫూర్తితో భరతనాట్యంలో రికార్డు సృష్టించాలని భావించాను.’ అని దీక్ష అన్నారు.