సాయుధ ఘర్షణల్లో చిక్కిన ‘బాల్యం’
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:35 AM
ప్రపంచవ్యాప్తంగా పలు సాయుధ ఘర్షణల్లో పిల్లలపై జరుగుతున్న హింస 2024లో తీవ్రస్థాయికి చేరిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. గాజాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
2024లో ‘తీవ్రస్థాయి’కి చిన్నారులపై హింస: ఐరాస
యునైటెడ్ నేషన్స్, జూన్ 20: ప్రపంచవ్యాప్తంగా పలు సాయుధ ఘర్షణల్లో పిల్లలపై జరుగుతున్న హింస 2024లో తీవ్రస్థాయికి చేరిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. గాజాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకు, కాంగో, సోమాలియా, నైజీరియా, హైతీల్లో అధిక సంఖ్యలో బాధితులున్నారని యూఎన్ వార్షిక నివేదిక తెలిపింది. పిల్లల హక్కులను ఉల్లంఘించే దేశాల బ్లాక్‌లిస్టు జాబితాలో ఇజ్రాయెల్ దళాలను ఐక్యరాజ్యసమితి రెండో ఏడాది కొనసాగించింది.
ఆ దేశ సైన్యం గాజాలో 1,259 మంది పాలస్తీనియన్ పిల్లలను చంపేసిందని, మరో 941 మందికి గాయపడ్డారని ప్రస్తావించింది. హమా్‌సతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్‌ను కూడా యూఎన్ బ్లాక్‌లిస్టులో ఉంచింది. మరోవైపు గతేడాది కాంగో, సొమాలియా, నైజీరియా, హైతీ దేశాల్లో కూడా పిల్లలకు వ్యతిరేకంగా వేలాది సంఖ్యలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయని ఐక్యరాజ్యసమితి నివేదించింది. అటు 2022 నుంచి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా సాయుధ దళాలు, దాని అనుబంధ సాయుధ గ్రూపులను మూడో ఏడాది బ్లాక్‌లిస్టులో కొనసాగించింది. ఉక్రెయిన్‌లో పిల్లలపై రష్యా బలగాల హింసాత్మక చర్యలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.