Share News

Strategic Partnership: భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:13 AM

భారత్‌, యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చల కోసం బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ బుధవారం....

Strategic Partnership: భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 8: భారత్‌, యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చల కోసం బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ బుధవారం ముంబైకి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం 125 మంది వాణిజ్య, విద్య, సంస్కృతిక రంగాల ప్రముఖులతో కూడిన భారీ బృందంతో వచ్చారు. భారత్‌, యూకే మధ్య ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. వివిధ రంగాల సంస్థలతో వాణిజ్య భాగస్వామ్యాలపై స్టార్మర్‌ బృందం చర్చలు జరపనుంది. అలాగే ప్రధాని మోదీతో స్టార్మర్‌ భేటీ కానున్నారు. బుధవారం స్టార్మర్‌ బృందం ముంబైలో ప్రముఖ బాలీవుడ్‌ సినీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్టూడియోను సందర్శించింది. యూకే సంస్థలతో ఉమ్మడిగా సినిమాల నిర్మాణంపై, యూకేలో షూటింగ్‌లపై పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించింది. అనంతరం స్టార్మర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిటన్‌కు బాలీవుడ్‌ వస్తుందని, సినిమాల నిర్మాణం చేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది మొదట్లో బ్రిటన్‌లోని లొకేషన్లలో తమ సినిమాల షూటింగ్‌లు నిర్వహించనున్నట్టు యశ్‌రాజ్‌ సంస్థ ప్రకటించింది. గురువారం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీతో స్టార్మర్‌ భేటీకానున్నారు. భారత్‌-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)తో ఇరుదేశాలకు సమకూరే ప్రయోజనాలు.. ప్రపంచ వాణిజ్యం, కొత్త సాంకేతికతలు, రక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించనున్నారు. కాగా, బుధవారం కీర్‌ స్టార్మర్‌ రాకను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Updated Date - Oct 09 , 2025 | 04:13 AM