Share News

NIA Investigation: రెండేళ్ల నుంచే ఉగ్ర కుట్ర

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:01 AM

దేశంలోని చాలా నగరాల్లో ఏకకాలంలో బాంబు దాడులు చేసేందుకు రెండేళ్ల నుంచే ప్రణాళిక రచించినట్లు ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠాలోని...

NIA Investigation: రెండేళ్ల నుంచే ఉగ్ర కుట్ర

  • అప్పటి నుంచే పేలుడు పదార్థాల కొనుగోలు

  • చాలా నగరాల్లో పేలుళ్లకు ప్లాన్‌ చేశాం

  • విచారణలో ఉగ్రవాది ముజమ్మిల్‌ వాంగ్మూలం

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): దేశంలోని చాలా నగరాల్లో ఏకకాలంలో బాంబు దాడులు చేసేందుకు రెండేళ్ల నుంచే ప్రణాళిక రచించినట్లు ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠాలోని కీలక నిందితుడైన డాక్టర్‌ ముజమ్మిల్‌ తెలిపాడు. బాంబుల తయారీ కోసం రెండేళ్ల నుంచి వివిధ ప్రదేశాల నుంచి అమ్మోనియం వంటి ఎరువులు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు ఎన్‌ఐఏ విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ముఠాలోని సభ్యులతో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు ఎవరెవరు సంప్రదింపులు జరిపారన్నది కూడా బయటపెట్టినట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. హరియాణాలోని గురుగ్రామ్‌, నూహ్‌లో ముజమ్మిల్‌ రూ.3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్‌పీకే (నైట్రోజన్‌, పాస్పరస్‌, పొటాషియం) ఎరువులను కొనుగోలు చేయగా, వాటితో బాంబుల తయారీ కోసం ప్రాసెస్‌ చేసే బాధ్యతను ఉమర్‌ నబీ(ఎర్రకోట ఆత్మాహుతి బాంబర్‌)కి అప్పగించినట్లు వెల్లడించాడు. ప్రాసెస్‌ చేసిన పేలుడు పదార్థాలను నిల్వచేసేందుకు ముజమ్మిల్‌ ఒక డీప్‌ ఫ్రీజర్‌ను కొనుగోలు చేశాడు. పదార్థాలను కలిపేందుకు ఒక ఎలక్ర్టిక్‌ గ్రైండర్‌ను, ఫర్నే్‌సను కొనుగోలుచేసి అల్‌ ఫలాహ్‌ వర్సిటీ పక్కనే ఉన్న ఒక కాలనీలో తనకు తెలిసిన క్యాబ్‌ డ్రైవర్‌ ఇంట్లో దాచాడు. బాంబుల తయారీ కోసం ఐదుగురు ఉగ్ర డాక్టర్లు స్వయంగా డబ్బు సమకూర్చినట్లు ముజమ్మిల్‌ వెల్లడించాడు. ఉమర్‌ రూ.2 లక్షలు, ముజమ్మిల్‌ రూ.5 లక్షలు, అదీల్‌ రూ.8 లక్షలు, ముజఫర్‌ రూ.6 లక్షలు, షాహీన్‌ సయీద్‌ రూ.5 లక్షలు తమ వాటాగా ఇచ్చినట్లు తెలిపాడు. ఈ డబ్బులో నుంచే రూ.6.5 లక్షలతో ముజమ్మిల్‌ ఒక ఏకే-47 తుపాకీని కొనుగోలు చేశాడు. పాకిస్థాన్‌ నుంచి తమతో ఎవరెవరు మాట్లాడింది కూడా ముజమ్మిల్‌ వెల్లడించాడు.


తనతో మన్సూర్‌ అనే వ్యక్తి, ఉమర్‌తో హషీమ్‌ సంప్రదింపులు జరిపేవాడని, వీరిద్దరు ఇబ్రహీం అనే మరో వ్యక్తి కింద పనిచేసేవారని తెలిపాడు. ఇదిలా ఉండగా, హైదరాబాదీ వైద్యుడు మొహియుద్దీన్‌కు ఆఫ్గనిస్థాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలు ఉన్న అబు ఖదీజా అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్‌ ద్వారా సూచనలు అందేవని, ఆ సూచనల మేరకే తన నివాసంలో రిసిన్‌ అనే విషం తయారుచేశాడని విచారణలో తేలింది.

Updated Date - Nov 23 , 2025 | 05:02 AM