Share News

Donald Trump: అ..శాంతిలో ట్రంప్‌!

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:42 AM

నాకు శాంతి నోబెల్‌ ఇవ్వాల్సిందే అంటూ హూంకరింపు... అయినా, నాకెందుకు ఇస్తారులే.. అంటూ నిష్ఠూరాలు.. ఇన్ని యుద్ధాలు...

Donald Trump: అ..శాంతిలో ట్రంప్‌!

  • నోబెల్‌ బహుమతి కోసం ఆరాటం

  • తనను కాదంటే అమెరికాను అవమానించినట్టేనని వింత వాదన

వాషింగ్టన్‌, అక్టోబరు 4 : ‘నాకు శాంతి నోబెల్‌ ఇవ్వాల్సిందే’ అంటూ హూంకరింపు... ‘అయినా, నాకెందుకు ఇస్తారులే..’ అంటూ నిష్ఠూరాలు.. ‘ఇన్ని యుద్ధాలు ఆపిన మరో మొనగాడు లేడు’ అంటూ ప్రగల్బాలు.. ‘కానీ, ఆ బహుమతి ఎప్పటికీ నాకివ్వరు’ అంటూ నిరాశ పలుకులు.. ఇదీ కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వరస.. ప్రపంచంలో శాంతిని సాధించినవారి కోసం ఏర్పాటుచేసిన శాంతి నోబెల్‌ విజేతను ఈ నెల 10వ తేదీన ప్రకటిస్తారు. ఆ టెన్షన్‌తో ట్రంప్‌ మరింత అశాంతితో రగిలిపోతున్నారు. ఏమైనా ఈసారి దానిని దక్కించుకోవాలని ఆరాటపడిపోతున్నారు. తాజాగా ట్రంప్‌ రూపొందించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్‌, హమాస్‌ పాక్షికంగా తలూపడంతో ఆయనకు ఇక పట్టపగ్గాలు లేకుండాపోయాయి. ‘శాంతి నోబెల్‌’పై ప్రకటనల్లో దూకుడు పెంచేశారు. ‘‘నాకు శాంతినోబెల్‌ ఇవ్వాల్సిందే. లేదంటే అమెరికాను ఘోరంగా అవమానించినట్టే’’నని తాజాగా ట్రంప్‌ సెలవిచ్చారు. గాజా కూడా కొలిక్కి వస్తే, మొత్తం ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అవుతుందని తెలిపారు. వర్జీనియాలోని క్వాంటికోలో సైనికాధికారులతో ట్రంప్‌ తాజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి నోబెల్‌ ప్రస్తావన వచ్చింది. ‘‘గాజాలో శాంతి సాధించాం. అక్కడ వివాదం పరిష్కారమైయినట్టే’’ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. హమాస్‌, ఇజ్రాయెల్‌, అరబ్‌ రాజ్యాలు, ముస్లిం దేశాలు.. అన్నీ తన శాంతి ప్రతిపాదనకు అంగీకరించాయని తెలిపారు. ఒకవేళ హమాస్‌ తోక జాడిస్తే అదే ఆసంస్థకు ఆఖరిరోజు అవుతుందని చెప్పి దారికి తెచ్చానని పేర్కొన్నారు. ‘ఇది అద్భుతం.. అమోఘం’ అంటూ తన జబ్బ తానే చరుసుకున్నారు. అంతలోనే ఆయన దిగాలుపడిపోయారు. ‘‘ఇంత చేశాం. గతంలో ఎవరూ ఇన్ని యుద్ధాలు ఆపలేదు. నేను ఇంత గొప్ప పని చేశాను. మరి.. నాకు శాంతినోబెల్‌ వస్తుందా అంటే.. కచ్చితంగా రాదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి చరిత్ర ఏదీ లేని ఎవరో అనామకుడికి, లేదంటే.. ఇన్ని యుద్ధాలు ఆపిన ట్రంప్‌ మెదడు పనితీరుపై పరిశోధన చేసే రచయితలకు శాంతి నోబెల్‌ ఇస్తారంటూ నిష్ఠూరాలాడారు. అయినా, చూద్దాం, ఏం జరుగుతుందోనంటూ ఒకింత ఆశాభావం కూడా ఈ భేటీలో ఆయన కనపరిచారు. ‘‘నా కోసం శాంతి నోబెల్‌ కోరడం లేదు. నాకు అవసరం లేదు కూడా. కానీ, అమెరికాకు ఈ గౌరవం దక్కాలి’ అన్నారు. ఎనిమిదో యుద్ధం ఆగిపోతే సహజంగానే ఆ గౌరవానికి అర్హత పొందినట్టేనని ధీమా వ్యక్తంచేశారు. ‘‘నావి వట్టి నోటి మాటలు కాదు. ఇలాంటి వ్యవహారాలు ఎలా ముడిపడతాయనేది, జీవితమంతా వాటితోనే గడిపిన నాకే బాగా తెలుస్తుంది’’ అని ట్రంప్‌ సెలవిచ్చారు.


2018 నుంచే ట్రంప్‌ పోరాటం..

ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్‌ బహుమతుల ప్రదానోత్సవానికి వేళయింది. సాహిత్యం.. అర్థికశాస్త్రం.. భౌతిక శాస్ర్త్రం... రసాయన శాస్త్రం.. వైద్యశాస్త్రం.. శాంతి.. ఇలా ఆరు విభాగాల్లో అవార్డులను ప్రకటించే కార్యక్రమం వచ్చే వారం నుంచి మొదలుకానుంది. ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ నుంచి విశ్వమాత మదర్‌ థెరెసా వరకు.. గౌరవించి ఈ అవార్డులు తమ గౌరవం పెంచుకున్నాయి. ట్రంప్‌ 2018లో తొలిసారి అధ్యక్షుడు అయినప్పటినుంచీ శాంతి నోబెల్‌ కోసం ఆయన పేరును పలువురు అమెరికన్లు, విదేశీ నేతలు ప్రతిపాదిస్తూ వస్తున్నారు. చివరిగా గత డిసెంబరులో ఓ రిపబ్లికన్‌ సభ్యురాలు ఆయన పేరును ఈ అవార్డుకు సూచించారు. ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల మధ్య సంబంధాలను సులభతరంచేస్తూ..అబ్రహాం ఒప్పందాలను కుదర్చడంతో ఆయన కృషిని అవార్డు కమిటీ గుర్తించాలని ఆమె కోరారు. నోబెల్‌ అవార్డు నిబంధనల ప్రకారం.. ట్రంప్‌ శాంతి నోబెల్‌ కోసం తన పేరును నామినేట్‌ చేసుకోవడానికి వీలు ఉండదు. ఆయన పేరును ఎన్నిసార్లు అయినా ఇతరులు నామినేట్‌ చేయొచ్చు. గత ఏడాది కాలంలో జరిపిన శాంతి కృషిని మాత్రమే అవార్డు కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. శాంతి అవార్డును నార్వేలోని ఓస్లోలో ప్రదానం చేస్తారు. సైన్స్‌ అవార్డులను స్టాక్‌హోమ్‌లో అందిస్తారు.

Updated Date - Oct 05 , 2025 | 03:42 AM