H 1B Visa Hike: భారత ఐటీ రంగంపై హెచ్ 1బీ పిడుగు
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:48 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు, ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు....
రూ.25 లక్షల కోట్ల వ్యాపారంపై ప్రభావం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఐటీ నిపుణులు
బెంగళూరు, సెప్టెంబరు 22: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు, ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి ఐటీ రంగం లబ్ధి పొందిందని, తాజాగా హెచ్-1 బీ వీసాకు లక్ష డాలర్ల రుసుమును నిర్ధారించడంతో ఈ రంగంపై పిడుగు పడినట్టు అయిందని చెబుతున్నారు. అమెరికా వర్క్ వీసా కార్యక్రమాలు, సాఫ్ట్ వేర్ ఔట్ సోర్సింగ్, వ్యాపార సేవలు తదితరాల రూపంలో భారత ఐటీ సెక్టార్ 283 బిలియన్ డాలర్ల(రూ.25 లక్షల కోట్లు) వ్యాపారం చేస్తోందని, తాజా పరిణామాలతో దీనిపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. భారత దేశ మొత్తం ఐటీ రంగం వాటాలో 57శాతం అమెరికా మార్కెట్ నుంచే లభిస్తోందని తెలిపారు. కాగా, గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే హెచ్-1బీ వీసాల విషయంలో భారత్ 71 శాతంతో అతిపెద్ద లబ్ధిదారుగా ఉందని చెబుతున్నారు. కేవలం 11.7 శాతం లబ్ధితో చైనా రెండోస్థానంలో ఉందని నిపుణులు తెలిపారు. మరోవైపు, యాపిల్, జేపీమోర్గాన్, వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, మెటా, అల్ఫాబెట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి పెరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు విదేశీయులను తగ్గించుకోవాలని, ఈ మేరకు మార్పులు చేసుకోవాలని కూడా వైట్‌హౌస్ పేర్కొంది. ఇది కూడా భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయుల కల చేజారుతోందని ఐటీ ఔట్‌సోర్స్ కంపెనీ జెన్సార్ టెక్నాలజీస్ సీఈవో గణేష్ నటరాజన్ తెలిపారు. ఔత్సాహికుల అమెరికా కల సంక్లిష్టంగా మారిందన్నారు. భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు పరిమితి పాటించనున్నాయని తెలిపారు. ఇదిలావుంటే, నాస్కామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. హెచ్-1బీ వీసా రుసుము పెంచడంతో అమెరికాను నిపుణుల కొరత వెంటాడుతుందని తెలిపింది. దీని ప్రభావం అమెరికా ఆవిష్కరణలు, ఐటీ రంగంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ‘ఎంకే’ గ్లోబల్ చీఫ్ ఎకానమిస్ట్ మాధవి అరోరా స్పందిస్తూ.. ప్రపంచ వాణిజ్యం సహా సాంకేతిక యుద్ధంలోకి సేవల ఎగుమతులు కూడా చేరే అవకాశం ఉందన్నారు. సప్లయ్ చైన్(సరఫరా వ్యవస్థ)పై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఇలా చాలా మంది నిపుణులు ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ ఒప్పందాలు సహా ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో భారత్‌కు చెందిన హెచ్-1బీ వీసా హోల్డర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫలితంగా చెల్లింపులు కూడా తగ్గుతాయన్నారు.
వీసా ఫీజును ఎత్తివేసే యోచనలో బ్రిటన్
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ లక్ష డాలర్లకు పెంచి హడలెత్తిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన పంథాలో ముందుకెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించే ప్రయత్నాలను బ్రిటన్ ప్రభుత్వం ముమ్మరం చేయాలనుకుంటోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సైన్స్, టెక్నాలజీ నిపుణులను తమ దేశానికి ఆకర్షించేందుకుగాను వీసా ఫీజును మినహాయించే దిశగా యోచన చేస్తున్నట్టుగా ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఇందులో భాగంగా భారతీయులు సహా ప్రపంచ నిపుణులను ఆకర్షించడంపై గ్లోబల్ టాలెంట్ టాస్క్‌ఫోర్స్ దృష్టిసారించినట్టు తెలిపింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే మార్గాలను అన్వేషించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఇది ప్రధాని కీర్ స్టార్మర్, చాన్స్‌లర్ రాచెల్ రీవ్స్‌కు నేరుగా నివేదిస్తుంది. వీసా ఖర్చులను సున్నాకు తగ్గించే యోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఆ ఆంగ్ల పత్రిక కథనం పేర్కొంది.