Share News

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు నాటో తరహా రక్షణ

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:58 AM

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఈ అంశంలో మరో ముందడుగు పడిందని తన సోషల్‌ మీడియా ట్రుత్‌లో పోస్టు పెట్టారు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు నాటో తరహా రక్షణ

  • అమెరికా, యూరప్‌ భద్రతా హామీ ఇచ్చేందుకు పుతిన్‌ అంగీకరించారు

  • ట్రంప్‌ ప్రత్యేక రాయబారి విట్కాఫ్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 17: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఈ అంశంలో మరో ముందడుగు పడిందని తన సోషల్‌ మీడియా ట్రుత్‌లో పోస్టు పెట్టారు. అదేమిటనేది వెల్లడించలేదు. తర్వాత దీనికి సంబంధించి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ కీలక వివరాలు వెల్లడించారు. నాటో తరహాలో అమెరికా, యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌కు భద్రతా హామీ (సెక్యూరిటీ గ్యారంటీ) ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకరించారని వెల్లడించారు. ‘‘నాటో ఆర్టికల్‌-5 ప్రకారం కూటమి సభ్య దేశాలపై బయటి దేశమేదైనా దాడి చేస్తే.. కూటమి దేశాలన్నీ అండగా నిలిచి, యుద్ధంలోకి దిగుతాయి.


ఈ రక్షణ కోసమే ఉక్రెయిన్‌ నాటోలో చేరాలనుకుంది. కానీ నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకునే అంశాన్ని పుతిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే నాటో ఆర్టికల్‌-5 తరహాలో ఉక్రెయిన్‌కు అమెరికా, యూరప్‌ దేశాలు భద్రతా హామీ ఇచ్చేందుకు అలాస్కా చర్చల్లో పుతిన్‌ అంగీకరించారు. పుతిన్‌ ఇలా అంగీకరించడం ఇదే మొదటిసారి’’ అని విట్కాఫ్‌ పేర్కొన్నారు. యుద్ధ విరమణ కోసం ఇదొక రాజీ ప్రయత్నమని, ఏదేమైనా ఉక్రెయిన్‌ అంగీకరించడంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు, సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం కానున్నారు. ట్రంప్‌ ఆహ్వానం, జెలెన్‌స్కీ విజ్ఞప్తి మేరకు పలు యూరప్‌, నాటో దేశాల నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 22న తనతోపాటు పుతిన్‌, జెలెన్‌స్కీ పాల్గొనేలా త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తానని యూరప్‌ దేశాల నేతలకు ట్రంప్‌ సమాచారం ఇచ్చారని అమెరికా మీడియా పేర్కొంది.

Updated Date - Aug 18 , 2025 | 05:58 AM