Truck Accident: రాజస్థాన్‌లో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృతి
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:39 AM
రాజస్థాన్‌లోని జైపుర్‌లో మద్యం మత్తులో ఉన్న ఒక డంపర్ ట్రక్కు డ్రైవర్ సోమవారం రహదారిపై బీభత్సం సృష్టించాడు..
జైపూర్, నవంబరు 3 : రాజస్థాన్‌లోని జైపుర్‌లో మద్యం మత్తులో ఉన్న ఒక డంపర్ ట్రక్కు డ్రైవర్ సోమవారం రహదారిపై బీభత్సం సృష్టించాడు. వరుసగా 5కి.మీ దూరం పలు వాహనాలపైకి దూసుకుపోవడంతో 19 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. జైపుర్‌లోని లోహమండి రోడ్డుపై వేగంగా వచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వస్తోన్న పలు వాహనాలపైకి దూసుకుపోయింది. ట్రక్కు డ్రైవర్ బాగా మద్యం మత్తులో ఉన్నాడని, 5కి.మీ. వరకు ఎదురుగా వచ్చిన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని మద్యం మత్తులో ఉన్న విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలకు తరలించారు. ప్రధాని మోదీ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ.2,00,000, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.