Share News

Fire accident: డివైడర్‌ దాటి బస్సును ఢీకొట్టిన లారీ

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:24 AM

అదుపుతప్పిన కంటెయినర్‌ లారీ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సును బలంగా ఢీకొనడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు..

Fire accident: డివైడర్‌ దాటి బస్సును ఢీకొట్టిన లారీ

  • రెండు వాహనాలూ బుగ్గి.. ఆరుగురు సజీవ దహనం

  • 28 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

  • కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం

బళ్లారి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అదుపుతప్పిన కంటెయినర్‌ లారీ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సును బలంగా ఢీకొనడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణ సమీపాన 48వ జాతీయ రహదారిపై జవర్గండనహళ్లి క్రాస్‌ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిందీ ఘోర ప్రమాదం. హిరియూరు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటెయినర్‌ లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అనంతరం ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకొంది. బస్సు డీజిల్‌ ట్యాంకును కంటెయినర్‌ బలంగా ఢీకొట్టడంతో అది పేలి, క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులోని ఐదుగురు ప్రయాణికులు, కంటెయినర్‌ డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణకు బుధవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 28 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌తో బయల్దేరింది. మధ్యలో మరో ఇద్దరు బస్సు ఎక్కారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. బస్సు డోర్లు తెరుచుకోకపోవడంతో అద్దాలను పగలగొట్టి పలువురు ప్రయాణికులు బయటపడ్డారు. వారే మరికొందరిని కాపాడారు. కాగా, డివైడర్‌ దాటి వచ్చిన లారీని చూసి బస్సును పక్కకు తప్పించేందుకు ప్రయత్నించానని, ఈలోపే వచ్చి ఢీకొట్టిందని బస్సు డ్రైవర్‌ రఫీక్‌ తెలిపారు. లారీ ఢీకొనడం వరకే తనకు గుర్తుందని, తర్వాత ఏం జరిగిందో, ఆస్పత్రిలోకి ఎలా వచ్చానో తెలియదని రఫీక్‌ చెప్పారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. మృతుల్లో బిందు అనే మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తె గ్రేయ కూడా ఉన్నారు. వీరితోపాటు మానస, నవ్య, రష్మి, కంటెయినర్‌ డ్రైవర్‌(పేరు తెలియరాలేదు) కూడా సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ బస్సు వెనుక ఉన్న స్కూల్‌ బస్సుకు తృటిలో ముప్పు తప్పింది. స్కూల్‌ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన స్కూల్‌ బస్సు వెంటనే పక్కకు తిరిగిపోయి రోడ్డు పక్కకు జారిపోయింది. బస్సులో ఎవరికీ ఏమీ కాలేదు.

Updated Date - Dec 26 , 2025 | 04:24 AM