Share News

Communal intolerance: చైనీయుడివా అంటూ.. త్రిపుర విద్యార్థిపై మూకదాడి!

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:59 AM

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి అంజెల్‌ చక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Communal intolerance: చైనీయుడివా అంటూ.. త్రిపుర విద్యార్థిపై మూకదాడి!

  • తీవ్ర గాయాలతో 17 రోజులు మృత్యువుతో పోరాడి మరణించిన చక్మా

  • డెహ్రాడూన్‌లో దారుణం

  • మృతుడు ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థి

  • అతడి తండ్రి బీఎ్‌సఎఫ్‌ జవాన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి అంజెల్‌ చక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆది, సోమవారాల్లో వేలాదిమంది విద్యార్థులు ఢిల్లీతోపాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థి అయిన అంజెల్‌ చక్మా తన సోదరుడు మైఖేల్‌ చక్మాతో కలిసి ఈ నెల 9వ తేదీన డెహ్రూడూన్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద ఉన్నప్పుడు.. ఆరుగురు దుండగులు ఆయనను చైనీయుడు, చింకీ, మొమో అంటూ గేలి చేశారు. దీనిని అంజెల్‌ ప్రతిఘటించటంతో.. అతడి మీద కత్తితో, ముంజేయి కడియంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజెల్‌ను స్థానికంగా ఆస్పత్రిలో చేర్చించారు. 17 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆ యువకుడు ఈ నెల 26వ తేదీన మరణించాడు. అంజెల్‌ తల, కాళ్లు, చేతుల మీద తెగిన గాయాలున్నాయని, వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నదని, శరీరం కుడివైపు పూర్తిగా స్పందన లేకుండా పోయిందని వైద్యులు నివేదికలో తెలియజేశారు. జరిగిన దారుణంపై అంజెల్‌ చక్మా తండ్రి, బీఎ్‌సఎఫ్‌ జవాను అయిన తరుణ్‌ ప్రసాద్‌ చక్మా స్పందిస్తూ.. తన కుమారుడిని చైనీయుడు అని అవమానిస్తూ దాడి చేసి కొట్టారని, ఈ ఘటనలో అతడి మెడ విరిగిపోయిందని, దానివల్లే మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగినా కూడా, తన చిన్నకుమారుడు మైఖేల్‌ ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయటానికి ఉత్తరాఖండ్‌ పోలీసులు తొలుత నిరాకరించారని, జరిగిన ఘటన చిన్నది అంటూ తోసిపుచ్చారని తెలిపారు. తాము త్రిపుర నుంచి వచ్చి పోలీసులతో మాట్లాడిన తర్వాత, ‘ఆలిండియా చక్మా విద్యార్థుల సంఘం’ ఒత్తిడి తెచ్చిన అనంతరం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని చెప్పారు. ‘అనేక మంది ఈశాన్య రాష్ట్రాల నుంచి విద్య, ఉద్యోగాల కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు వెళ్తుంటారు. వారిని అవమానించటం తగదు. మనమంతా భారతీయులం’ అని తరుణ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. తరుణ్‌ ప్రసాద్‌తో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి మాట్లాడారు. జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని, మరొకడు నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోందన్నారు.


విద్వేషం సాధారణమైపోయింది: రాహుల్‌

అంజెల్‌ చక్మా మృతిపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘ఇది అత్యంత భయానకమైన విద్వేషపూరిత నేరం. విద్వేషం అనేది రాత్రికి రాత్రే మొదలు కాదు. గత కొన్నేళ్లుగా ప్రతి రోజూ దేశ ప్రజలకు ముఖ్యంగా యువతకు విషపూరిత, బాధ్యతారహిత సమాచారాన్ని ఆహారంలాగా అందిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అగ్రనేతలు స్వయంగా ఈ విద్వేష ప్రచారం చేస్తూ దీనిని ఒక సాధారణ పరిస్థితి అన్నట్లు తయారుచేశారు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. మన దేశ వైవిధ్యతను గౌరవించుకోలేని అజ్ఞానం, తప్పుడు అభిప్రాయాల కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఇది విషాదం మాత్రమే కాదు.. దేశానికే సిగ్గుచేటైన దారుణమని అభివర్ణించారు. అంజెల్‌ హత్యను త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా ఖండించారు.

Updated Date - Dec 30 , 2025 | 03:59 AM