Tragic Accident: విరిగిపడిన ఆర్చ్ దిమ్మెలు.. 9 మంది దుర్మరణం
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:39 AM
చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆర్చ్ దిమ్మెలు విరిగిపడి తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు.
ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో ప్రమాదం
మృతులంతా అసోం రాష్ట్ర వాసులు
చెన్నై, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆర్చ్ దిమ్మెలు విరిగిపడి తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. బాధితులంతా అసోం రాష్ట్ర వాసులని పోలీసులు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో వెయ్యి మందికిపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఆర్చ్ నిర్మాణ పనుల్లో 30 మంది కార్మికులు ఉన్నారు. నిర్మాణంలో ఉన్న ఆర్చ్ దిమ్మెలు మంగళవారం సాయంత్రం హఠాత్తుగా కూలాయి. ఆ దిమ్మెలు 20 మంది కూలీలపై పడటంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ రాష్ట్ర కార్యదర్శి జె.రాధాకృష్ణన్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.