Toxic Cough Syrup: ఔషధం..నిర్లక్ష్యం..విషం!
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:44 AM
అదో చిన్న ఫార్మా కంపెనీ.. ఎన్నో మందులు తయారు చేసి అమ్ముతోంది.. పెద్ద కంపెనీలతో పోటీపడలేక అడ్డదారులు తొక్కుతోంది.. మందులపై ఎక్కువ ఎమ్మార్పీ...
నాణ్యతలేని మందులతో ప్రజలకు ప్రాణ సంకటం
రసాయనం కలిసిన దగ్గుమందుతో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 14 మంది మృతి
అదో చిన్న ఫార్మా కంపెనీ.. ఎన్నో మందులు తయారు చేసి అమ్ముతోంది.. పెద్ద కంపెనీలతో పోటీపడలేక అడ్డదారులు తొక్కుతోంది.. మందులపై ఎక్కువ ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) ముద్రించి.. అతి తక్కువ ధరకే మందుల షాపులకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తుంది.. వైద్యులకు అడ్డగోలు కమీషన్లు ఆశచూపి.. పేషెంట్లకు తమ మందులే రాసేలా ప్రలోభపెడుతుంది.. ఇటు వైద్యులకు, అటు మందుల షాపులకు బోలెడు లాభం.. ఇంతదాకా బాగానే ఉంది. కానీ అతి తక్కువ ధరకు మందులు, ఆపై కమీషన్లు ఇస్తూ, తాను కూడా లాభం పొందాలంటే.. ఆ ఫార్మా కంపెనీ ఎంత నాణ్యంగా మందులు తయారు చేస్తుంది? చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయదా? ప్రాణాలకు ప్రమాదం తలెత్తదా? మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అదే జరిగింది. ఓ చిన్న ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందులోని విష పదార్థాల కారణంగా ముక్కుపచ్చలారని 14మంది చిన్నారులు చనిపోయారు.
ప్రమాదకర రసాయనం కలవడంతో..
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో పిల్లలకు ఇచ్చిన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందును ల్యాబ్‌లలో పరీక్షించగా ‘డైథైలీన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథైలీన్ గ్లైకాల్ (ఈజీ)’గా పిలిచే ప్రమాదకర రసాయనాల ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. తమిళనాడులోని కాంచీపురంలో శ్రేసన్ ఫార్మా కంపెనీకి చెందిన యూనిట్‌లో ఈ దగ్గు మందు తయారైంది. డీఈజీ, ఈజీ రసాయనాలను పరిశ్రమల్లో పెయింట్లు, బ్రేక్ ఫ్లూయిడ్స్, కొన్ని రకాల ప్లాస్టిక్ తయారీలో వినియోగిస్తారు. మందుల తయారీకి వాటితో ఏమాత్రం సంబంధం ఉండదు. అయితే ఔషధాల తయారీలో వాడే గ్లిసరిన్ వంటి ముడి పదార్థాల రవాణా సమయంలో వాటిలో డీఈజీ, ఈజీ చేరే అవకాశం ఉంటుంది. డీఈజీ, ఈజీ మన శరీరంలో మూత్రపిండాలు, కాలేయంతోపాటు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతాయి.
వైద్యులు, దుకాణదారుల కక్కుర్తితో..
చిన్న ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం వైద్యులను, మందుల దుకాణాల వారిని ప్రలోభపెట్టడం సాధారణంగా మారిపోయింది. అతి తక్కువ ధరకు ఇచ్చే ఆ మందులపై ఎమ్మార్పీ మాత్రం పెద్ద పెద్ద కంపెనీల మందులకన్నా ఎక్కువగా ఉంటుంది. దీనితో వైద్యులు, దుకాణాల వారికి భారీగా మార్జిన్లు మిగులుతాయి. దీనితో వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు ఆ కంపెనీల మందులే రాస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో పరిస్థితులు, పరికరాలు, ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, తూతూమంత్రంగా పరిశీలించి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
‘దగ్గు మందు’ కంపెనీల్లో తనిఖీలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దగ్గు మందుతో చిన్నారులు మృతి చెందడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆదివారం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా దగ్గు మందు తయారీ సంస్థల వివరాలు సేకరించి.. వెంటనే ఆయా యూనిట్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు, పరీక్షలకు ఏర్పాట్లు ప్రారంభించారు. - సెంట్రల్ డెస్క్
పిల్లల మృతి కేసులో వైద్యుడి అరెస్టు
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో దగ్గుమందు కారణంగా పిల్లలు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ సోనిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ దగ్గుమందు తయారుచేసిన సంస్థపైనా కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. కోల్ర్డిఫ్ దగ్గు మందుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రవీణ్ సోని ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఈ దగ్గుమందును సిఫారసు చేసినట్లు ఛింద్వారా ఎస్పీ చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్‌ను వైద్య విధుల నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ నెల 2వ తేదీన ఇచ్చిన తమ నివేదికలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన కోల్ర్డిఫ్ దగ్గుమందు డైఇథలీన్ గ్లైకాల్(48.6ు)తో కల్తీ అయ్యిందని పేర్కొంది.