CJI Security: దుర్బేధ్యంగా సుప్రీంకోర్టు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:33 AM
దేశ సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పైకి సోమవారం ఓ న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేయడం..
700 మంది భద్రతా సిబ్బంది
సీజేఐకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అయినా.. సీజేఐపై దాడి యత్నం
న్యూఢిల్లీ, అక్టోబరు 7: దేశ సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పైకి సోమవారం ఓ న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేయడం.. భద్రతా సిబ్బంది హుటాహుటిన స్పందించి నిలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు భద్రత, సీజేఐ సహా న్యాయమూర్తులకు కల్పిస్తున్న భద్రత వంటివి చర్చకు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు సుప్రీంకోర్టు.. అత్యంత దుర్బేధ్యమని వెల్లడించారు. 700 మంది భద్రతా సిబ్బంది నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలిపారు. ప్రతి కోర్టురూమ్‌కు ప్రత్యేకంగా సాయుధ గార్డు ఉంటారని, ముఖ్యంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న సీజేఐకి మరింత అదనపు భద్రత ఉంటుందని వివరించారు. ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా ఏజెన్సీలకు చెందిన గార్డులు సుప్రీంకోర్టు ఆవరణలో భద్రతా విధులు నిర్వహిస్తారని తెలిపారు. న్యాయమూర్తులు, సిబ్బంది, అధికారులు సహా అందరి భద్రతను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కాగా, సీజేఐపై బూటు విసరబోయిన న్యాయవాది రాకేశ్ కిశోర్ సుప్రీంకోర్టు లాయర్ కాదని, ఓ సీనియర్ అడ్వొకేట్ సాయంతో తాత్కాలిక పాస్‌ను సంపాయించుకుని కోర్టులోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు.