Strategic Errors: 3 తప్పులు.. ఓటమి తిప్పలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:49 AM
బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ చేసిన మూడు ప్రధాన వ్యూహాత్మక తప్పిదాలు మహాగఠ్‌బంధన్ కూటమి ఓటమికి దారితీశాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఆర్జేడీ, కాంగ్రెస్ చేసిన వ్యూహాత్మక పొరపాట్లతో మహాగఠ్ బంధన్ కూటమికి దెబ్బ
పట్నా, నవంబరు 15: బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ చేసిన మూడు ప్రధాన వ్యూహాత్మక తప్పిదాలు మహాగఠ్‌బంధన్ కూటమి ఓటమికి దారితీశాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. సామాజిక సమీకరణాలను అంచనా వేయడంలో విఫలం కావడం, ప్రచార తీరు సరిగా లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల ఓటర్లను పట్టించుకోకపోవడం గట్టిగానే ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి గెలిచి సీఎం కావడం ఖాయమనుకున్న తేజస్వి యాదవ్ ఆశలు ఆవిరయ్యాయని అంటున్నారు. నిపుణుల విశ్లేషణల మేరకు.. మహాగఠ్ బంధన్ కూటమి అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల అంచనాల్లో విఫలమైంది. యాదవ వర్గానికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వడం.. ఓబీసీలు, ఈబీసీలు, దళితుల్లో ఆందోళన కలిగించింది. ప్రత్యామ్నాయంగా ఆ ఓట్లన్నీ ఎన్డీయే వైపు మళ్లాయి. ఎన్నికలకు ముందే తేజస్వియాదవ్‌ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ప్రభావం చూపింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రచారం మొదట్లో ఓటు చోరీ చుట్టూనే తిరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై ఇరు పార్టీల శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశాయి. కానీ క్షేత్రస్థాయిలో దీని ప్రభావం లేదని పార్టీ శ్రేణలు చెప్పినా అధినేతలు వినిపించుకోలేదు. చివరికి పోలింగ్ దగ్గరపడ్డాక ఒక్కసారిగా ఓటుచోరీని వదిలేసి, స్థానిక అంశాలు, సంక్షేమ హామీలు ఇచ్చారు. బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్జేడీకి మంచి పట్టు ఉండేది. కానీ ఈసారి పట్టణ ప్రాంతాల ఓటర్లు, చదువుకున్న యువతను ఆకట్టుకునే దిశగానే హామీలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టకపోవడం ప్రభావం చూపింది. పంటలకు కనీస మద్దతు ధరల పెంపుపై ఆశలు పెట్టుకున్న రైతులకు మహాగఠ్ బంధన్ నుంచి ఆ దిశగా హామీ రాలేదు.