Supreme Court: ముగ్గురు సుప్రీం జడ్జీల ప్రమాణం
ABN , Publish Date - May 31 , 2025 | 05:59 AM
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్‌వీ అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
34కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
న్యూఢిల్లీ, మే 30: సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్‌వీ అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ పదవీప్రమాణం చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో వారితో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు పూర్తి బలాన్ని సంతరించుకుంది. సీజేఐతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుకుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల పదవీవిరమణతో ఖాళీ అయిన స్థానాల్లో కర్ణాటక, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ అంజారియా, బిష్ణోయి.. బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చందూర్కర్‌లను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గత సోమవారం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేయడం, వారి నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ గురువారం ‘ఎక్స్’లో ప్రకటించడం తెలిసిందే.