Nuclear Threat: అణు దాడికి అవకాశం ఎంత?
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:46 AM
పాక్ తన అణ్వస్త్ర విధానాన్ని ఆధారంగా పెట్టుకుని భారతపై చిన్న ఉద్రిక్తతలకు కూడా అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చని బెదిరిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్‌ను రూపొందించింది.
పాక్‌పై భారత్ యుద్ధం ప్రకటిస్తే పాక్ భారత్‌పై అణు దాడికి పాల్పడుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ పాక్ అణు విధానం (న్యూక్లియర్ డాక్ట్రిన్)ను పరిశీలిస్తే చిన్న కారణాలకే భారత్‌పై అణ్వస్త్ర ప్రయోగం చేయవచ్చన్నట్టుగా దానిని రూపొందించినట్టు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సమాచారం ప్రకారం నాలుగు రకాల పరిస్థితుల్లో భారత్‌పై అణు దాడి చేయవచ్చని పాక్ అణు విఽధానం చెబుతోంది. (కుడివైపు బాక్స్ చూడండి) దీనిని బట్టి చూస్తే భారత్‌పై అణ్వస్త్ర ప్రయోగం చేయడానికి పాక్‌కు మరీ పెద్ద కారణమంటూ అవసరం లేదు. సంప్రదాయ ఆయుధాల్లో భారత్‌తో తాను పోటీ పడలేదు కాబట్టి భారత్‌తో చిన్న ఉద్రిక్తత తలెత్తితే చాలు... అణ్వస్త్రాలు ప్రయోగించేస్తామని పాక్ బెదిరిస్తూ ఉంటుంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, రైల్వే శాఖ సహాయమంత్రి హనీఫ్ అబ్బాసీలు భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తామంటూ దుందుడుకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రకటనల ద్వారా భారత్ తమపై అసలు దాడే చేయకుండా అడ్డుకోవాలనేది పాక్ ఎత్తుగడ. అయితే పాక్ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అడ్డుకునేందుకు భారత్ ఒక ప్రతివ్యూహాన్ని రూపొందించింది. అదే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్!
పాక్ ఎప్పుడు అణుదాడి చేస్తుందంటే?
1. భౌగోళిక కారణాలు
భారత సైన్యం పెద్దఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకువెళితే... ప్రత్యేకించి సింధు లోయను దాటి వస్తే
2, సైనిక కారణాలు
పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేస్తే... ప్రత్యేకించి పాక్ వాయుసేనను భారత్ గట్టిగా దెబ్బతీస్తే లేదా పాక్ అణు కేంద్రాలపై/ స్థావరాలపై దాడి చేస్తే లేదా పాక్‌పై రసాయన/జీవ ఆయుధాలతో దాడి చేస్తే
3, ఆర్థిక కారణాలు
పాక్ నౌకాదళాన్ని దెబ్బతీసి నావల్ బ్లాకేడ్ (1971లో కరాచీ పోర్టును భారత్ దిగ్బంధం చేసిన తరహాలో) ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే లేదా సింధు, జీలం, చీనాబ్ నదుల్లో పాక్ వాటా జలాలను విడుదల చేయకుండా అడ్డుకుని పాక్‌ను ఆర్థికంగా అతలాకుతలం చేస్తే
4, రాజకీయ కారణాలు
పాక్‌లో రాజకీయ అస్థిరత కలిగిస్తే... లేదా పాక్‌లో ఏదైనా ప్రాంతాన్ని
ఆ దేశం నుంచి విడగొడితే (బంగ్లాదేశ్ మాదిరి)
ఇవి కూడా చదవండి..