Tharoor Praises PM Modi: ప్రధాని ప్రసంగం విన్నందుకు సంతోషించా!
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:24 AM
ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని పాల్గొన్న ఓ సభకు తాను కూడా హాజరయ్యానని, ఆయన ప్రసంగం విన్న సభికులలో తానూ....
మోదీ ‘రాంనాథ్ గోయెంకా’ స్మారక ఉపన్యాసంపై థరూర్ ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ, నవంబరు 18: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని పాల్గొన్న ఓ సభకు తాను కూడా హాజరయ్యానని, ఆయన ప్రసంగం విన్న సభికులలో తానూ ఒకడిని అయినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోదీ రామ్‌నాథ్ గోయెంకా స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సభకు శశిథరూర్ కూడా హాజరయ్యారు. దీనిపైనే ఆయన తాజాగా స్పందించారు. ఎల్లప్పుడూ ఎన్నికల మూడ్‌లోనే ఉంటానని తన మీద విమర్శలున్నాయని.. కానీ, తాను ప్రజల సమస్యలు పరిష్కరించే ఎమోషనల్(భావోద్వేగ) మూడ్‌లో ఉన్నానని మోదీ ఈ ఉపన్యాసంలో చెప్పారు. కాగా, ‘‘మోదీ ప్రసంగం ఆర్థిక దృక్కోణానికి, జాతిని ఆచరణలోకి దింపే సాంస్కృతిక పిలుపునకూ, దేశ ప్రగతి కోసం అవిరామంగా కృషి చేయాలనే దృఢదీక్షకు అద్దం పట్టింది’’ అంటూ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఈ సభకు మాజీ కాంగ్రెస్ నేత గులాంనబీఆజాద్ కూడా హాజరై, థరూర్ పక్కనే కూర్చున్నారు.