Share News

High Alert: విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు..

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:34 AM

విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర పౌరవిమానయాన భద్రత బ్యూరో (బీసీఏఎస్‌) అప్రమత్తమైంది.

High Alert: విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు..

  • దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించిన బీసీఏఎస్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర పౌరవిమానయాన భద్రత బ్యూరో (బీసీఏఎస్‌) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ మధ్య ఎయిర్‌పోర్టులపై ఉగ్రవాదులు లేదా సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంజెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని పేర్కొంటూ బీసీఏఎస్‌ ఈ నెల 4న అడ్వైజరీ జారీచేసింది. విమానాశ్రయాలు, రన్‌వేలు, హెలిప్యాడ్‌లు, ఫ్లైయింగ్‌ స్కూల్స్‌, శిక్షణ సంస్థల్లో భద్రతను పెంచాలని అందులో ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది టెర్మినల్‌, పార్కింగ్‌ ప్రాంతం, విమానాశ్రయ చుట్టపక్కల ప్రాంతాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసుల సాయంతో విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో పంపే పార్శిళ్లను నిశితంగా సోదా చేస్తున్నారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లతోపాటు విజిటర్లను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. సీసీటీవీ ఫుజేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విమానాశ్రయాల వద్ద ఎవరైనా వ్యక్తులు గానీ, వస్తువులు గానీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ను అప్రమత్తం చేయాలని బీసీఏఎస్‌ అడ్వైజరీలో పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్స్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అందులో సూచించింది.

Updated Date - Aug 07 , 2025 | 05:36 AM