Share News

Terror Network: పాక్‌ ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:52 AM

భారతదేశంలో ఖిలాఫత్‌ ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటే లక్ష్యంగా పన్నాగం పన్నుతున్న ఓ ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు రట్టు చేశారు. తెలంగాణ సహా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో...

Terror Network: పాక్‌ ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు

  • తెలంగాణ సహా వేర్వేరు రాష్ట్రాల్లో ఐదుగురి అరెస్టు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

న్యూఢిల్లీ, నిజామాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారతదేశంలో ఖిలాఫత్‌(ఇస్లామిక్‌ రాజ్యం) ఏర్పాటే లక్ష్యంగా పన్నాగం పన్నుతున్న ఓ ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు రట్టు చేశారు. తెలంగాణ సహా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు చేసి పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగిన ఆ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధా లు, పేలుడు పదార్ధాల తయారీకి వాడే పరికరాలు, రసాయనాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఝార్ఖండ్‌కు చెందిన అషర్‌ దానిష్‌(23), తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన మొహమ్మద్‌ హుజెఫ్‌ యమన్‌(20), ముంబైకి చెందిన అఫ్తాబ్‌ ఖురేషి(25) సుఫియాన్‌ అబూబకర్‌ ఖాన్‌(20), మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రాన్‌ ఖురేషి(26) ఉన్నారని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ కేసులో తొలుత ఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు సెమీ ఆటోమెటిక్‌ పిస్టళ్లతో అఫ్తాబ్‌ ఖురేషి, సుఫీయాన్‌ ఖాన్‌ సెప్టెంబరు 9న అరెస్టయ్యారు.విచారణ అనంతరం సెప్టెంబరు 10న రాంచీ, థానే, బెంగళూరు, నిజామాబాద్‌, రాయ్‌ఘడ్‌లో దాడులు చేసి మిగిలిన వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన అషర్‌ దానిష్‌ ఈ ముఠాకు మాస్టర్‌మైండ్‌. నిందితులంతా గజ్వా ఈ హింద్‌ అనే ఇస్లామిక్‌ విధానంలో జిహాద్‌ ద్వారా భారత్‌ను జయించేందుకు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు దేశంలో అనువైన చోటుకోసం గాలిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెంది న ఉగ్రవాద హ్యాండ్లర్లు సామాజిక మాధ్యమాల్లో ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాల ద్వారా నిందితులతో సంప్రదింపులు జరిపేవారు. ఆయుధా లు, పేలుడు పదార్థాల తయారీకి కావాల్సిన రసాయనాల సేకరణపై సూచనలిచ్చేవారు. ఆయుధాల తయారీ, ఉగ్రవాదం వ్యాప్తికి దేశంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నిందితులు పని చేస్తున్నారు. కాగా, ఈ ముఠాకు మాస్టర్‌మైండ్‌గా పేర్కొన్న దానిష్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. అతని తండ్రి న్యాయవాది కాగా సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన దానిష్‌.. సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర నిందితులను ఆకర్షించాడు. తనని తాను కంపెనీ సీఈవో, ప్రొఫెసర్‌, ఎన్జీవో నిర్వాహకుడు అని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పలు ఖాతా లు తెరిచిన దానిష్‌ వాటి ద్వారా తన కార్యకలాపాలు సాగించేవాడు. ఇక, పదో తరగతి వరకు చదివిన అఫ్తాబ్‌ ఖురేషీ తన తండ్రికి మాంసం వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఐదో తరగతి వరకే చదివిన సుఫియాన్‌ అబూబకర్‌ ఖాన్‌ వెల్డింగ్‌ పను లు చేస్తుంటాడు. కమ్రాన్‌ ఖురేషి ల్యాబోరేటరి సహాయకుడిగా, న్యాయవాదుల వద్ద టైపిస్టుగా పని చేస్తుంటాడు.


యమన్‌.. బీఫార్మసీ విద్యార్థి

పోలీసులు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అరెస్టు చేసిన మహమ్మద్‌ హూజెఫ్‌ యమన్‌...డిచ్‌పల్లి వద్ద ఉన్న తిరుమల నర్సింగ్‌ కళాశాలలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దానిష్‌ సూచనల ప్రకారం ఆయుధా లు, మందుగుండు సామగ్రిని పరీక్షించేవాడినని యమన్‌ విచారణలో అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత్‌లో ముస్లిం లు అణిచివేతకు గురవుతున్నారంటూ రెచ్చగొట్టిన దానిష్‌.. యమెన్‌ను ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు. కాగా, యమన్‌.. దాని్‌షతో వీడియో కాల్‌ మాట్లాడిన విషయం నిజమేనని యమన్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ యమన్‌కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని, తన కుమారుడిని విడిచిపెట్టాలని అతని తల్లి వేడుకుంటున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 03:52 AM