Bihar Elections: కూటములు, కులాల కుంపట్లో..అన్ని పక్షాలకూ అగ్నిపరీక్షే!
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:18 AM
ఒకప్పుడు ఆటవిక పాలనతో ‘జంగిల్ రాజ్’గా పేరుపొందిన బిహార్‌లో దంగల్ మొదలైంది. కూటములు, కులాల కుంపట్లతో సతమవుతున్న....
ప్రతిష్ఠాత్మకంగా మారిన బిహార్ ఎన్నికలు... మసకబారిన నితీశ్ ప్రతిష్ఠ.. మోదీపైనే ఎన్డీయే ఆశలు
రాహుల్, తేజస్వి ఆధ్వర్యంలో మహా ‘గట్టి’ బంధన్ ప్రయత్నాలు
ప్రశాంత్ కిషోర్ ప్రభావమెంత?
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఆటవిక పాలనతో ‘జంగిల్ రాజ్’గా పేరుపొందిన బిహార్‌లో దంగల్ మొదలైంది. కూటములు, కులాల కుంపట్లతో సతమవుతున్న ఆ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. బిహార్‌కు వరాల జల్లు కురిపించడంతోపాటు ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రధాని మోదీకి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా జాతీయ స్థాయిలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. స్థానికంగా జేడీయూ నేత, సీఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వియాదవ్‌తోపాటు కొత్తగా రంగంలోకి దిగిన జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
ముక్కోణపు పోటీ.. మధ్యలో ఆప్!
ప్రస్తుతం బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ, పలు చిన్న పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి ఓ వైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి మరోవైపు తలపడుతున్నాయి. కొత్తగా జనసురాజ్ పార్టీతో తెరపైకి వచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూటమి రాజకీయాలకు తానే ప్రత్యామ్నాయం అంటూ జనంలోకి వెళుతున్నారు. దీనికితోడు కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బిహార్‌లో అడుగుపెట్టింది. అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడమే కాదు.. 11 చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తాము పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ప్రకటించారు.
ఎన్డీయే సత్తా చాటేనా..
ఒకప్పుడు జంగిల్ రాజ్‌గా పేరుపొందిన బిహార్.. నితీశ్ పాలనలో అభివృద్ధి వైపు మళ్లిందన్న అభిప్రాయం ఉంది. రెండు దశాబ్దాలుగా ఆయనకు ‘సుశాసన్‌బాబు (మంచి పరిపాలకుడు)’గా పేరుంది. బిహార్‌లో వెనుకబడిన కులాల్లో ఒకటైన కుర్మి వర్గం జనాభా గణనీయంగా ఉంటుంది. అదే వర్గానికి చెందిన నితీశ్‌కుమార్‌కు వారం తా మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే ఈ విజయపరంపరను నితీశ్ కొనసాగించగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2020లో బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. మధ్యలో ఆ కూటమిని వదిలి, ఆర్జేడీ-కాంగ్రె్‌సతో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2024లో మళ్లీ రాజీనామా చేసి ఎన్డీయే కూటమిలో చేరడంపై విమర్శలు వచ్చాయి. దానికితోడు ఇటీవల నితీశ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మారవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఒకవేళ ఎన్డీయే గెలిచినా నితీశ్ సీఎం కాకపోవచ్చని, ఆయన శకం ముగిసినట్టేననే వాదనలూ ఉన్నాయి. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాని మోదీ కరిష్మాపైనే ఆశలు పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగానే బిహార్‌లో వరుస పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ.. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
రాహుల్ మహా ‘గట్టి’ బంధన్ ప్రయత్నాలు..
ఎన్డీయేకు దీటుగా నిలిచేందుకు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కూటమి తమ తరఫున తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ముందుపెట్టి ప్రచారం చేస్తోంది. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కలకలం రేపిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇటీవలే బిహార్‌లో రెండు వారాలపాటు ‘ఓటర్ అధికార యాత్ర’ నిర్వహించారు. ప్రచారంలోనూ ఆయన దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే బిహార్‌లో కాంగ్రె్‌సకు పెద్దగా పట్టులేదు. ఆర్జేడీ వెనకే నడుస్తోంది. రాహుల్ పర్యటనలతో బిహార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నా.. కాంగ్రె్‌సకు ఎన్ని సీట్లు దక్కుతాయి, అందులో ఎన్ని గెలుస్తుందన్నది తేలాల్సి ఉంది.
ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఉంటుందా?
జన సురాజ్ పార్టీతో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుల, మత, రాజకీయ కొలమానాలకు అతీతంగా ప్రజలను తమ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో, యువతలో ఆయన వైపు సానుకూల స్పందన కనిపిస్తోంది. కానీ ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావం చూపగలరన్నది తేలాల్సి ఉంది.
తేలనున్న తేజస్వి యాదవ్ భవిష్యత్తు
కొన్నేళ్లుగా బిహార్ రాజకీయాల్లో బాగా ఫోకస్ ఉన్న నాయకుడు 35 ఏళ్ల తేజస్వి యాదవ్. మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడిగా తెరపైకి వచ్చిన ఆయన... తమ పార్టీ ఆర్జేడీపై పూర్తి పట్టు సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గణనీయమైన ప్రభావం చూపారు. మహాఘట్‌బంధన్ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకే ఎక్కువ. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భవితవ్యం ఏమిటన్నది తేలిపోనుంది. బిహార్‌లో గట్టి పట్టున్న యాదవులు ఆర్జేడీ వెంట ఉండటంతో ఆ పార్టీ పట్టునిలుపుకొంటూ వస్తోంది. ఇటీవలి రాహుల్ ఓటర్ అధికార యాత్ర, తాను చేసిన బిహార్ అధికార యాత్రల జనంలో మంచి స్పందన రావడంతో తమ కూటమి గెలుపుపై తేజస్వి ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటి మాదిరిగా ముస్లింలు, యాదవులు ఆర్జేడీ వైపు నిలుస్తారని భావిస్తున్నారు.