Supreme Court: దేవుడి నిధులు ఆలయానివే
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:00 AM
భగవంతుడికి చెందాల్సిన ఆలయ నిధులను, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులను కాపాడేందుకు వాడరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది....
నష్టాల్లోని బ్యాంకులను ఆదుకోవడానికి వాటిని వాడరాదు
బ్యాంకులకు అవి ఆదాయ వనరు కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, డిసెంబరు 5: భగవంతుడికి చెందాల్సిన ఆలయ నిధులను, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులను కాపాడేందుకు వాడరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై కేరళ హైకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల బెంచ్ ధ్రువీకరిస్తూ, ఆ రాష్ట్రానికి చెందిన సహకార బ్యాంకుల పిటిషన్‌ను తిరస్కరించింది. కాలపరిమితి తీరిన తర్వాత కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లను క్లియర్ చేయడానికి నిరాకరించడంతో ఈ సహకార బ్యాంకులకు వ్యతిరేకంగా తిరునెల్లి దేవస్థానం కేరళ హైకోర్టుకు వెళ్లింది. ఆలయ దేవస్థానం డిపాజిట్లను రెండు నెలల్లో తిరిగి ఇచ్చేయాలంటూ ఆ బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ఐదు బ్యాంకులకుగాను, మనంతవాడి కో ఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనే రెండు బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, హైకోర్టు నిర్ణయాన్నే సీజే బెంచ్ సమర్థించింది. ‘‘బ్యాంకులను రక్షించడానికి ఆలయ నిధులను వాడాలంటారా’’ అని సీజే ప్రశ్నించారు. ఆలయ నిధులు భగవంతుడికి చెందినవని, వాటిని కేవలం ఆలయ అవసరాల కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు. సహకార బ్యాంకుల మనుగడకు, వాటి ఆదాయానికి ఈ నిధులు వనరు కారాదని తేల్చిచెప్పారు. రెండు నెలల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులను తిరిగి ఇచ్చేయాలన్న హైకోర్టు తీర్పును సవరించడానికి నిరాకరించారు.